జూన్‌ 2 నుంచి ‘రైతు డిస్కం’ | Rythu DISCOM operations to begin in full swing from State Formation Day | Sakshi
Sakshi News home page

జూన్‌ 2 నుంచి ‘రైతు డిస్కం’

Apr 10 2026 4:28 AM | Updated on Apr 10 2026 4:28 AM

Rythu DISCOM operations to begin in full swing from State Formation Day

నెలాఖరుకల్లా ఆస్తుల విభజన, హెచ్‌ఆర్‌ కేటాయింపులు పూర్తి 

రాష్ట్ర అవతరణ రోజు నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు విద్యుత్‌ పంపిణీ సంస్థ (రైతు డిస్కం) కార్యకలాపాలు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ప్రస్తుతం రెండుగా ఉన్న డిస్కంలు మూడుగా మారడంతో కొత్త డిస్కం నిర్మాణాన్ని భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా మరింత సమగ్రంగా, సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు గురువారం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌సీఐ)లో కీలక సమావేశం జరిగింది. 

ఈ సమావేశంలో రైతు డిస్కం చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముషారఫ్‌ ఫరూఖీతోపాటు పలువురు ఉన్నతాధికారులు, ఏఎస్‌సీఐ విద్యుత్‌ విభాగానికి చెందిన నిపుణులు, పాలసీ, నిర్వహణ రంగాల్లో అనుభవజ్ఞులు పాల్గొన్నారు. సంస్థ నిర్మాణానికి సంబంధించిన వ్యూహాత్మక అంశాలపై లోతైన చర్చలు జరిపారు. ప్రధానంగా ఆస్తుల విభజనపై చర్చ జరిగింది. ప్రస్తుత విద్యుత్‌ పంపిణీ సంస్థల నుంచి రైతు డిస్కంకు బదిలీ చేయాల్సిన ఆస్తుల గుర్తింపు, విలువ నిర్ణయం, పారదర్శకంగా విభజన చేపట్టే విధానాలపై చర్చించారు. 

సాంకేతిక, ఆర్థిక పరమైన ప్రభావాలను కూడా సమీక్షించారు. మానవ వనరుల సమకూర్పులో భాగంగా ఉద్యోగుల కేటాయింపు, నైపుణ్యాల ఆధారంగా విభజన, అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణ కార్యక్రమాలు, సేవా నిబంధనల రూపకల్పనపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ఫార్మాట్‌ తయారు చేశారు. వినియోగదారుల వ్యవహారాలకు సంబంధించి వ్యవసాయ, నీటి పారుదల, వాటర్‌ వర్క్స్‌ ఇతర వినియోగదారులను వేరు చేసి రైతు డిస్కంకు అనుసంధానం చేసే ప్రక్రియ, డేటా సమీకరణ, కచ్చితమైన వినియోగదారుల డేటాబేస్‌ తయారీ, సేవల సరళీకరణపై చర్చించారు. 

ఆస్తుల విభజన, మానవ వనరుల కేటాయింపు ప్రక్రియలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయడానికి చర్యలు ప్రారంభించినట్టు ముషారఫ్‌ ఫరూఖీ తెలిపారు. ఏఎస్‌సీఐ సెంటర్‌ ఫర్‌ ఎనర్జీ స్టడీస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రాజకిరణ్‌ వి బిలోలికర్, రైతు డిస్కం చీఫ్‌ ఇంజినీర్లు పి.ఆనంద్, ఏ.కామేశ్, శ్రవణ్‌కుమార్, సీజీఎం సుధా మాధురి, ఏఎస్‌ఐసీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement