‘దళితబంధు’ ఇక బడ్జెట్‌ తర్వాతే!

Rs 17700 Crore For Dalit Bandhu In Telangana Budget - Sakshi

లబ్ధిదారుల ఎంపికపై ఎటూ తేల్చని రాష్ట్ర ప్రభుత్వం

ఎమ్మెల్యేల సిఫారసు ద్వారా ఎంపికను తప్పుబట్టిన హైకోర్టు 

దీంతో 2022–23లో ఇప్పటికీ మొదలు కాని ఎంపిక ప్రక్రియ 

ప్రభుత్వ మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్న ఎస్సీ కార్పొరేషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రతీ నియోజకవర్గంలో 500 మంది ‘దళితబంధు’లబ్ధిదారుల ఎంపికపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో భారీ మొత్తంలో నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పథకం కింద నయాపైసా కూడా విడుదల చేయలేదు. లబ్ధిదారుల ఎంపికపై నెలకొన్న సందిగ్ధంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.

దళితబంధు పథకం కింద లబ్ధిదారుల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలను ప్రకటించలేదు. కేవలం ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారినే అర్హులుగా నిర్ధారిస్తూ వారికి దళితబంధు సాయాన్ని అందిస్తూ వచ్చింది. అయితే ఎమ్మెల్యేల సిఫారసు వ్యవహారం అంతా పక్షపాతధోరణితో జరుగుతోందని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎమ్మెల్యేల సిఫారసుతో సంబంధం లేకుండా అర్హులను గుర్తించాలని హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించిన ఎస్సీ కార్పొరేషన్‌.. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తోంది. అయితే మరో రెండు నెలల్లో 2022–23 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో ఈ పథకం అమలుపై అధికారవర్గాలు దిక్కులు చూస్తున్నాయి. 

వచ్చే బడ్జెట్‌తో కలిపేలా.. : 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించింది. ఇందులో ఒక్కో నియోజకవర్గానికి 1,500 యూనిట్ల చొప్పున నిధులు కేటాయించగా.. ఆమేరకు అమలుపై దృష్టిపెట్టింది. అయితే ఒకేసారి 1,500 మంది ఎంపిక బదులుగా తొలివిడతలో ఒక్కో నియోజకవర్గం నుంచి 500 చొప్పున లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.

ఇంతలోనే లబ్ధిదారుల ఎంపిక విధానంపై హైకోర్టు ఆక్షేపణ చెప్పడంతో అధికారులు ఎంపిక ప్రక్రియను నిలిపివేశారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే ఎంపిక మొదలు పెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్, ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోంది. కాగా, మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ దరఖాస్తుల స్వీకరణ, అర్హుల నిర్ధారణ కష్టమని అధికారులు చెబుతున్నారు.

ఈ క్రమంలో ప్రస్తుత నిధులను వచ్చే బడ్జెట్‌కు క్యారీఫార్వర్డ్‌ చేస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈమేరకు 2023–24 వార్షిక బడ్జెట్‌లో ప్రస్తుత ఏడాది దళితబంధు నిధులను కలిపి ప్రతిపాదనలు తయారు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. సోమవారం ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశంలో ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు భావిస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top