అతివేగం.. 6 ప్రాణాలు బలి | Road accident occurred near Hyderabad Shamshabad | Sakshi
Sakshi News home page

అతివేగం.. 6 ప్రాణాలు బలి

May 2 2026 4:25 AM | Updated on May 2 2026 7:41 AM

Road accident occurred near Hyderabad Shamshabad

ఔటర్‌ రింగు రోడ్డుపై లారీని వెనుక నుంచి ఢీకొన్న కారు

ఔటర్‌పై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు

ఆరుగురి దుర్మరణం.. ఓ మహిళకు తీవ్ర గాయాలు

శంషాబాద్‌లో ఘటన... మృతులు సిరిసిల్లవాసులు

శంషాబాద్‌ రూరల్‌/ సిరిసిల్ల: దైవ దర్శనానికి వెళ్లి.. తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. శంషాబాద్‌ శివారులో ఔటర్‌ రింగు రోడ్డుపై శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. చేవెళ్ల డీసీపీ యోగేశ్‌గౌతం తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్లలోని సర్దార్‌నగర్‌కు చెందిన కొడెం శ్రీనివాస్‌ (40), సనత్‌నగర్‌లో నివాసముండే బొల్లి శివకుమార్‌(37) వరుసకు బావబామ్మర్దులు.

శుక్రవారం తెల్లవారుజామున రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు కలిసి సనత్‌నగర్‌ నుంచి శివకుమార్‌కు చెందిన వ్యాగనార్‌ కారులో యాదగిరిగుట్ట దైవ దర్శనానికి వెళ్లారు. ఆ తర్వాత స్వర్ణగిరి ఆలయానికి వచ్చి సనత్‌నగర్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గ మధ్యలో ఔటర్‌ రింగు రోడ్డుపై పెద్దగోల్కొండ–తొండుపల్లి మధ్యలో రోడ్డు పక్కన  ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొంది.

లారీ కిందకు దూసుకెళ్లిన కారు..
అతి వేగంతో ఉన్న కారు లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనతో కారులో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లారీ కిందకు దూసుకెళ్లిన కారును అతి కష్టం మీద వెనక్కి తీసి అందులోని ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన కొడెం శ్వేతను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారును శివకుమార్‌ నడుపుతున్నట్టు గుర్తించారు.

లారీ ఆగిన ఐదు నిమిషాల్లోనే
చౌటుప్పల్‌లోని రైస్‌మిల్లు నుంచి నూకల లోడుతో నంద్యాలలోని లిక్కర్‌ ఫ్యాక్టరీకి లారీ బయలుదేరింది. ఔటర్‌ మీద పెద్దగోల్కొండ–తొండుపల్లి మధ్యలోకి రాగానే లారీ బ్రేక్‌లైనర్లు మొరాయించడంతో డ్రైవర్‌ శ్రీనివాస్‌ గమనించి రోడ్డు పక్కన నిలిపాడు. డ్రైవర్‌ బ్రేక్‌లను పరిశీలిస్తుండగా.. క్లీనర్‌ లారీపై ఉన్న తాడును సరి చేస్తున్నాడు. సాయంత్రం 4 గంటలకు లారీని నిలపగా, ఐదు నిమిషాల తర్వాత కారు వెనుక నుంచి వచ్చి ఢీకొన్నట్టు లారీ డ్రైవర్‌ శ్రీనివాస్‌ తెలిపాడు.

మృతులు వీరే..
బొల్లి శివకుమార్‌ (37), బొల్లి లాస్య అలియాస్‌ రెనికిండి రాజేశ్వరి (30) దంపతులు, వీరి కూతురు బొల్లి రిషిత (7)తో పాటు కొడెం శ్రీనివాస్‌(40), ఆయన కుమారులు కొడెం కృష్ణచంద్ర (13), కొడెం మాధవ్‌ (10) దుర్మరణం చెందగా, శ్రీనివాస్‌ భార్య శ్వేత (35) తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉంది. శివకుమార్‌కు శ్వేత సోదరి అవుతారు.

బొల్లి శివకుమార్‌ కామారెడ్డికి చెందిన లాస్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లాస్య హైదరాబాద్‌లోని పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రధాన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌.
⇒  కోడం శ్రీనివాస్‌ వేములవాడలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కాలు విరిగింది.



ప్రమాద కారణాలు విశ్లేలిస్తున్నాం: డీసీపీ యోగేశ్‌గౌతం
ఘటనా స్థలాన్ని చేవెళ్ల డీసీపీ యోగేశ్‌గౌతం పరిశీలించారు. డ్రైవర్‌ అలసిపోవడంతో నిద్రలోకి జారి ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కారులో మరైదేనా సాంకేతిక సమస్యతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో పరిశీలన చేస్తున్నామన్నారు. ప్రమాదానికి గురైన కారుపై అతి వేగంతో కారు నడిపినట్టు రెండు చలాన్లు ఉన్నాయి.

ఇదే ఆఖరి సెల్ఫీ..
రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబ సభ్యులంతా కలిసి చివరిసారిగా స్వర్ణగిరి దేవాలయం వద్ద సెల్ఫీ దిగారు. ఇప్పుడు ఈ సెల్ఫీ వారి జీవితంలో చివరి ఫొటోగా మిగిలింది.

కేటీఆర్‌ దిగ్భ్రాంతి
ఆరుగురు సిరిసిల్లవాసుల మృతిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. తాము అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement