హైదరాబాద్: ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డును అందుకున్న నిర్మల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జానకి షర్మిలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మహిళల భద్రతపై అవగాహన కల్పించే విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దాదాపు 7,000 మంది విద్యార్థినులు, మహిళలకు అవగాహన కల్పించడం ప్రశంసనీయమని అన్నారు.
నిర్మల్ లో నిర్వహించిన "పోలీస్ అక్క" కార్యక్రమం యావత్ పోలీసు యంత్రాంగానికి మంచి ప్రేరణగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి కొనియాడారు. సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై మహిళా పోలీసు అధికారులు పోలీస్ అక్కలుగా మారి మహిళలు, బాలికలకు ఆత్మవిశ్వాసం కల్పించడం అభినందనీయమన్నారు.
మహిళల భద్రత కోసం, ముఖ్యంగా విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి ఒక వినూత్నమైన ఆలోచనతో “పోలీస్ అక్క” పేరిట నిర్మల్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి జాతీయ స్థాయిలో స్కోచ్ (SKOCH) అవార్డు లభించడం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు.
బండి సంజయ్ అభినందనలు
ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు సాధించినందుకు ఐపీఎస్ జానకి షర్మిల, నిర్మల్ జిల్లా పోలీసులకు అభినందనలు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ట్వీట్ చేశారు. నిర్మల్‌లో పోలీస్ అక్క వంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి విజన్ ఎలా ఉండాలో, హార్డ్‌వర్క్ ఎలా చేయాలో ఈ అవార్డు చాటిచెబుతుంది. పోలీస్ అక్క కార్యక్రమం కరుణతో కూడిన పోలీసింగ్ ఎలా జీవితాలను మార్చగలదో చూపించడానికి ఓ ఉదాహరణగా నిలుస్తుంది. మహిళా అధికారులను మార్గదర్శకులు, రక్షకులుగా నిలబెట్టడం ద్వారా ఈ కార్యక్రమం భద్రతను మాత్రమే కాకుండా యువతుల్లో నిజమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. తమ భవిష్యత్తును సురక్షితంగా ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది’ అని అన్నారు.
తెలంగాణ డీజీపీ ప్రశంసలు
కరుణతో కూడిన పోలీసింగ్‌ను పోలీస్ అక్క వంటి అద్భుతమైన కార్యక్రమం ప్రతిబింబిస్తుందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. రక్షణతో పాటు అంతకుమించి ఆత్మవిశ్వాసం, మార్గదర్శకత్వం, భద్రత భావాన్ని అందించే స్ఫూర్తిదాయక ప్రయత్నమని చెప్పారు. నిర్మల్ జిల్లాలో జానకి షర్మిల నాయకత్వంలో సాగుతున్న ఈ కార్యక్రమానికి స్కోచ్ అవార్డు రావడం గర్వకారణమని అన్నారు. భద్రతతో కూడిన సమాజ నిర్మాణంలో ఇది గొప్ప ముందడుగని చెప్పారు.


