
మహబూబ్‌నగర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBC) సొరంగం కూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల జాడ కోసం నిర్వహిస్తున్న సహాయక చర్యలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేయనుంది. గడచిన 63 రోజులుగా నిర్విరామంగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన ఎనమిది మందిలో ఇప్పటికీ కేవలం ఇద్దరు మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. మిగిలిన ఆరుగురి ఆచూకీ ఇంకా లభించలేదు. ప్రమాదం జరిగిన టన్నెల్‌లో డేంజర్ జోన్ వద్ద కూడ పనులు పూర్తయ్యాయి. కేవలం క్రిటికల్ జోన్‌లో మాత్రమే సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంది కాని అక్కడ పనులు చేయాలంటే నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంతవరకు ఇక సహాయక చర్యలు నిలిపివేయటం మేలన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఫిబ్రవరి 22న పైకప్పు కూలడంతో 8 మంది గల్లంతు కాగా, ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. మిగిలిన వారి మృతదేహాల కోసం నిర్విరామంగా అన్వేషణ కొనసాగుతుంది. క్రిటికల్ జోన్‌లో మిగిలిన ఆరుగురి మృతదేహాలు ఉండవచ్చని భావిస్తున్నారు. 12 ఏజెన్సీలకు చెందిన దాదాపు 550 మంది మూడు షిప్పుల్లో పనిచేశారు. భారీ ఊరుతున్న నీటిని పెద్దపెద్ద పంపులతో డీ వాటరింగ్ చేశారు. మట్టి, బురదను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తరలించారు.
టీబీఎం మిషన్‌ను గ్యాస్, ధర్మల్ కట్టర్స్‌తో కటింగ్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకొచ్చారు. చివరి 43 మీటర్ల ప్రాంతం మినహా సొరంగంలోని ఇతర ప్రాంతాల్లో పైకప్పు కూలడంతో పడిన మట్టి, బండరాళ్లు, ఇనుప తుక్కును తొలగించి అన్వేషించినా గల్లంతైన వారిజాడ తెలియరాలేదు. చివరి 43 మీటర్లు అత్యంత ప్రమాదకరంగా ఉందని, ఈ ప్రాంతంలో సహాయక చర్యలను కొనసాగిస్తే మళ్లీ పైకప్పు కూలవచ్చని నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్సిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని జలసౌధలో భవిష్యత్ ప్రణాళికలు, రక్షణ చర్యలపై ఏర్పాటైన నిపుణు కమిటీ సమావేశం అయ్యింది. సహాయక చర్యలకు ప్రస్తుతానికి బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించారు. సహాయక చర్యల విషయంలో ఏవిధంగా ముందుకెళ్లాలనే అంశంపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌కు చెందిన నిపుణులతో సబ్ కమిటీ వేసి అధ్యయనం జరిపించాలని నిర్ణయించారు. సైట్ స్పెసిఫిక్ రిపోర్టును తయారు చేయాలని కమిటీని కోరారు. కమిటీ నివేదిక ఆధారంగా సహాయక చర్యల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోనున్నారు.
నివేదిక ఇచ్చేందుకు కనీసం మూడు నెలల సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. సమావేశంలో డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్దతిలో సొరంగం పనులు చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. మరోవైపు ఉపరితలం నుంచి సొరంగం చివరి ప్రాంతానికి ప్రత్యామ్నాయ మార్గం నిర్మించాలంటే కూడ ఇదంతా అమ్రాబాద్ రక్షిత పూలుల అభయారణ్య పరిధిలో ఉండటంతో కేంద్రం అనుమతులు తప్పని సరి. అనుమతులు రావటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. మరి భవిష్యత్ లో ఎస్‌ఎల్‌బీసీల కొనసాగింపుపై ఏ మార్గాన్ని ఎంచుకోవాలో సబ్‌కమిటీ నివేదిక మీద అధారపడి ఉంది.
కాగా అవుట్లెట్ మన్నెవారిపల్లి వైపు నుంచి మాత్రం టీబీఎం ద్వారా తవ్వకాలను కొనసాగించడం సురక్షితమని భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికా నుంచి తెప్పించిన బేరింగ్, అడాప్టర్, రింగ్ బేర్‌లు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నె వారిపల్లి అవుట్లెట్ వద్దకు చేరాయి. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.