‘సర్వీసు’ లేకుండానే ఆర్‌ఆర్‌ఆర్‌! | Regional Ring Road going to be constructed without service roads | Sakshi
Sakshi News home page

‘సర్వీసు’ లేకుండానే ఆర్‌ఆర్‌ఆర్‌!

Aug 7 2024 5:31 AM | Updated on Aug 7 2024 5:31 AM

Regional Ring Road going to be constructed without service roads

తొలుత డిజైన్‌ చేసినా తిరస్కరించిన ఎన్‌హెచ్‌ఏఐ ఈసీ  

ఆర్‌ఆర్‌ఆర్‌ జాతీయ ఎక్స్‌ప్రెస్‌ వే అయినందున ఐఆర్‌సీ నియమావళి పరిధిలోకి.. 

పక్కల నుంచి వాహనాలు ఎక్స్‌ప్రెస్‌ వే పైకి వచ్చే అవకాశం ఉండదు 

కేవలం ఇంటర్‌చేంజ్‌ కూడళ్ల వద్ద స్లిప్‌ రోడ్ల మీదుగా ఎక్కేందుకే వీలు

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)ను సర్వీసు రోడ్లు లేకుండా నిర్మించబోతున్నారు. తద్వారా పూర్తిగా యాక్సెస్‌ కంట్రోల్డ్‌ పద్ధతిలో.. పక్కల నుంచి ఇతర వాహనాలు ఈ ఎక్స్‌ప్రెస్‌ వేపైకి రాకుండా నిరోధించనున్నారు. దీంతో ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి దాదాపు 352 కి.మీ. నిడివితో రూపుదిద్దుకోనున్న ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా దూసుకుపోయేందుకు అవకాశం ఉంటుంది. జాతీయ, రాష్ట్ర రహదారులను క్రాస్‌ చేసే చోట నిర్మించే ఇంటర్‌చేంజ్‌ కూడళ్లలోని స్లిప్‌ రోడ్ల మీదుగా మాత్రమే ఇతర వాహనాలు ట్రిపుల్‌ ఆర్‌ మీదకు చేరుకోవాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, ఆటో రిక్షాలు, నెమ్మదిగా కదిలే భారీ వాహనాలకు దీని మీదకు అనుమతి ఉండదు.  

సర్వీసు రోడ్ల ప్రతిపాదనకు తిరస్కారం 
హైదరాబాద్‌ నగరానికి మణిహారంగా మారిన నెహ్రూ ఔటర్‌ రింగురోడ్డు తరహాలో ట్రిపుల్‌ ఆర్‌కు కూడా తొలుత సర్వీసు రోడ్లను ప్రతిపాదించారు. ఆ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కార్యాలయానికి డిజైన్లు పంపారు. అయితే ఎన్‌హెచ్‌ఏఐ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. జాతీయ రహదారులకు స్థానిక పరిస్థితుల ఆధారంగా సర్వీసు రోడ్లను నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల సర్వీసు రోడ్లను నిర్మించకుంటే స్థానికులు ఆందోళనలకు దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో ఎక్స్‌ప్రెస్‌ వేలకు ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) ప్రత్యేక నియమావళిని రూపొందించింది. ఇందులో సర్వీసు రోడ్డు ప్రతిపాదనే లేదు. ట్రిపుల్‌ ఆర్‌ను కూడా ఎక్స్‌ప్రెస్‌వేగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియమావళికి విరుద్ధమంటూ సర్వీస్‌ రోడ్ల ప్రతిపాదనకు కమిటీ తిరస్కరించింది.  

సర్వీసు రోడ్లుంటే ఇబ్బందేంటి? 
సాధారణ జాతీయ రహదారులతో పోలిస్తే ఎక్స్‌ప్రెస్‌ వేలపై వేగ పరిమితి చాలా ఎక్కువ. వాహనాలు భారీ వేగంతో దూసుకుపోతున్న సమయంలో, సర్వీసు రోడ్ల నుంచి అకస్మాత్తుగా వాహనాలు ప్రధాన క్యారేజ్‌ వే మీదకు వచి్చనప్పుడు ప్రమాదాలు చోటు చేసుకునే వీలుంటుంది.  
ఎక్స్‌ప్రెస్‌ వేపై సర్వీసు రోడ్డుతో అనుసంధానమైన ప్రతిచోటా టోల్‌ బూత్‌ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇది వాహనాలు ఎక్స్‌ప్రెస్‌వే స్థాయి వేగంలో ప్రయాణించే వెసులుబాటును అడ్డుకుంటుంది.  

⇒ పూర్తి యాక్సెస్‌ కంట్రోల్డ్‌ పద్ధతిలో నిర్మిస్తున్నందున అది దాదాపు 25 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఇరువైపులా బారికేడింగ్‌ ఉంటుంది. దీంతో పశువులు కానీ, జంతువులు కానీ దాని మీదకు రాలేవు. సర్వీసు రోడ్లు ఉంటే వాటి మీదుగా అవి ఎక్స్‌ప్రెస్‌ వే పైకి వచ్చి ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితి ఉంటుంది.  

⇒ ఎక్స్‌ప్రెస్‌ వేల మీద సాధారణ ప్రయాణ వాహనాల కంటే అంతర్రాష్ట్ర సరుకు రవాణా వాహనాలు ఎక్కువగా దూసుకుపోతాయి. వాటికి అడ్డంకులు ఉండకూడదు. గతంలో గుజరాత్‌లో స్థానికులు సర్వీసు రోడ్ల మీదుగా ఎక్స్‌ప్రెస్‌ వే మీదకు పెద్ద సంఖ్యలో చేరుకుని వారి డిమాండ్ల సాధన కోసం రోజుల తరబడి నిరసనలు నిర్వహించారు. దీంతో అంతర్రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా ఎక్స్‌ప్రెస్‌ వేలకు సర్వీసు రోడ్డు ఆప్షన్‌ తొలగించారు.  

గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి అయినందున.. 
ఊళ్లకు దగ్గరగా ఉండే జాతీయ రహదారుల మీదకు స్థానిక వాహనాలు చేరుకునేందుకు వీలుగా సర్వీసు రోడ్లు నిర్మిస్తారు. కానీ ట్రిపుల్‌ ఆర్‌ పూర్తి గ్రీన్‌ఫీల్డ్‌ (పూర్తిగా కొత్త) రహదారి అయినందున దీన్ని ఊళ్లకు దూరంగా నిర్మిస్తున్నారు. కాబట్టి సర్వీసు రోడ్ల అవసరం ఉండదని ఎన్‌హెచ్‌ఏఐ చెబుతోంది. నెహ్రూ ఔటర్‌ రింగురోడ్డు కూడా ఎక్స్‌ప్రెస్‌ వే నే అయినా.. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు. కాబట్టి దీనికి జాతీయ ఎక్స్‌ప్రెస్‌ వేల నియమావళి వర్తించదు. 

ఖమ్మం–దేవరపల్లి మధ్య నిర్మిస్తున్న కొత్త హైవేకి అనుసంధానంగా సర్వీసు రోడ్లు నిర్మించాలని కొన్ని ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చేస్తూ పనులను ముందుకు సాగనీయటం లేదు. అది కూడా జాతీయ ఎక్స్‌ప్రెస్‌ వేలో భాగంగా నిర్మిస్తున్నందున, సర్వీసు రోడ్డు ఆప్షన్‌ ఏర్పాటు చేయలేదు. దీంతో పనులు కొనసాగాలంటే పోలీసు భద్రత కలి్పంచాలని ఇటీవల ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరటం విశేషం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement