చూసి నేర్చుకుంటున్నారు! పిల్లల మత్తుకు పెద్దలే కారణం | Sakshi
Sakshi News home page

చూసి నేర్చుకుంటున్నారు! పిల్లల మత్తుకు పెద్దలే కారణం

Published Wed, Jun 22 2022 7:09 AM

Recent cases of students and youth becoming addicted to drugs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల విద్యార్థులు, యువత మత్తుకు బానిసలవుతున్న కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. పాశ్చాత్య సంస్కృతి, సినిమాల ప్రభావం ఎంత కారణమో.. ఇంట్లో తల్లిదండ్రులు, గ్రాండ్‌ పేరెంట్స్‌ను చూసి కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నట్లు నేషనల్‌ డ్రగ్‌ డిపెండెన్సీ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌ (ఎన్‌డీడీటీసీ) సర్వేలో తేలింది. హైదరాబాద్‌ సహా దేశంలోని ప్రముఖ నగరాలలో 8 నుంచి 12వ తరగతికి చెందిన 6 వేల మంది విద్యార్థులతో సర్వే నిర్వహించింది. ఇందులో 10 శాతం మంది యువత పొగాకు, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవిస్తున్నట్లు తేలింది. వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించగా.. ఇంట్లో పెద్దలను చూసి అలవాటు చేసుకున్నట్లు బయటపడటం గమనార్హం. 

స్మార్ట్‌ ఫోన్‌లో డ్రగ్స్‌ కోసం శోధన.. 
కరోనా అనంతరం పిల్లలకు సెల్‌ఫోన్‌ వినియోగడంతో ఆన్‌లైన్‌లో మత్తు పదార్థాల కోసం శోధిస్తున్నారు. డ్రగ్‌ పెడ్లర్స్‌ వాట్సాప్‌ గ్రూప్‌లలో యువతను చేర్చి, డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న కేసులు వెలుగు చూడటమే ఇందుకు నిదర్శనం. నిద్రమాత్రలు, ఆల్ప్రాజోలం, క్లోర్డియాజిపాక్సైడ్‌ వంటి యాంగ్జైటీ మాత్రలు, దగ్గు టానిక్‌లు, పెయిన్‌ కిల్లర్స్‌ వంటి ఫార్మసీ మెడిసిన్స్‌ కూడా పిల్లలు వినియోగిస్తున్నట్లు అమృతా ఫౌండేషన్‌ ఫౌండర్‌ డాక్టర్‌ దేవికా రాణి తెలిపారు. రిహాబిలిటేషన్‌ కౌన్సెలింగ్‌ పలువురు యువతలో ఈ విషయం బయటపడిందని పేర్కొన్నారు. నెలకు సుమారు వంద మంది మత్తు బానిసలు ఆశ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. వీటిలో 10– 15 కేసులు 18 ఏళ్ల లోపు వయసున్న యువతే ఉన్నారు. 

పసిగట్టకపోతే ప్రమాదమే.. 
పని ఒత్తిడి లేదా బోర్‌ అనిపించినా ఇంట్లో పెద్దలు పొగాకు, ఆల్కహాల్‌ వంటివి సేవిస్తుండటం చూసి పిల్లలు నేర్చుకుంటున్నారు. కరోనా తర్వాత నుంచి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు, గొడవలు పెరిగిపోయాయి. ఈ ప్రభావం కూడా పిల్లల మీద చూపిస్తోంది. పిల్లల్లో మత్తు పదార్థాల వినియోగాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు. మత్తుకు బానిసలుగా మారి ఎంత దారుణానికైనా ఒడిగట్టే ప్రమాదం ఉంది. నేరాలకు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయి. ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది. చెడు వ్యవసాల నుంచి యువతను మాన్పించడం సైకాలజిస్ట్‌లకు కత్తి మీద సాము. ఎందుకంటే ఆ వయసు పిల్లల్లో మెదడు సంపూర్ణ స్థాయిలో అభివృద్ధి చెందదు. దీంతో తిరిగి సులువుగా చెడు వ్యసనాలకు ఆకర్షితులవుతారని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.  

ఈ లక్షణాలుంటే అనుమానించాల్సిందే..  

  • ఎక్కువ సమయం ఒంటరిగా గడుపుతుంటారు. ఆడుకోవటం, ఇతరులతో మాట్లాడకపోవటం, ఎప్పుడూ బద్ధకంగా ఉంటారు. ఎక్కువగా ఏడుస్తుంటారు లేదా పడుకుంటారు. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతుంటారు. 
  • ప్రతి అంశానికీ భావోద్వేగాలకు లోనవుతుంటారు. సామాజిక మాధ్యమాలలో లైఫ్‌ గురించి నెగిటివ్‌ కొటేషన్లు పెడుతుంటారు. ఉన్నట్టుండి చదువులో తక్కువ మార్కులు రావటం. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఎక్కువగా ఆడుతుంటారు. డ్రగ్స్‌కు సంబంధించిన పేర్లను సెల్‌ఫోన్లలో షార్ట్‌కట్‌లో పేర్లు పెట్టుకుంటారు. 
  • చైల్డ్‌ రిహాబిలిటేషన్‌ 
  • సెంటర్లు అత్యవసరం 
  • కేరళ, ఢిల్లీ, ముంబైలో ఉన్నట్లు ప్రభుత్వ చైల్డ్‌ డ్రగ్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్లు మన దగ్గర లేవు. రిహాబిలిటేషన్‌ వైద్యం ఖర్చులు భరించే ఆర్థిక స్థోమత చాలా మంది పేరెంట్స్‌ ఇబ్బందులు పడుతున్నారు. అందుకే మానసిక ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో చైల్డ్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలి. దీంతో చెడు వ్యసనాల నుంచి పేద విద్యార్థులు, యువతను కాపాడి, ఉజ్వల భవిష్యత్తును అందించినట్లవుతుంది. 

– కె.దేవికా రాణి, డైరెక్టర్, అమృతా ఫౌండేషన్‌  

(చదవండి: ఇంటికో ఉద్యోగమని మొండిచేయి చూపారు: వైఎస్‌ షర్మిల)

Advertisement
 
Advertisement
 
Advertisement