రూట్‌ మార్చిన రైతులు.. కొత్త రకం సాగుతో అన్నదాతకు లాభాలు!

Ranga Reddy Farmers Profits From Dragon Fruit And Fish Farming - Sakshi

నష్టాల నుంచి గట్టెక్కేందుకు రైతుల కొత్త దారి 

వ్యవసాయ అనుబంధ రంగాల వైపు మొగ్గు చూపుతున్న వైనం  

డ్రాగన్‌ ఫ్రూట్స్‌ సాగు, చేపల పెంపకం  

ఒకరిని చూసి మరొకరు ఇదే మార్గం    

కొందుర్గు, రంగారెడ్డి జిల్లా: ఆహార, వాణిజ్య పంటలతోపాటు కూరగాయలు, ఆకుకూరలు, పూలతోటలు సాగులో అధిక పెట్టుబడులు పెట్టి నష్టాలపాలైన రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎక్కడో థాయ్‌లాండ్, వియత్నం దేశాల్లో సాగుచేసే డ్రాగన్‌ పండ్ల తోటలతోపాటు చేపల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. ఎలాంటి చీడపీడలు ఆశించని, తక్కువ పెట్టుబడితో సాగుచేసే డ్రాగన్‌ పండ్ల తోటలను రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గు మండలం ఉమ్మెంత్యాల, ముట్పూర్‌ గ్రామాల రైతులు ఉద్యాన శాఖ అధికారుల సలహాలతో సాగు చేస్తున్నారు. ఫ్రూట్స్‌ పండించడంతోపాటు డ్రాగన్‌ మొక్కలకు సంబంధించిన నర్సరీని సిద్ధం చేసి ఇతర రైతులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయానికి అంతగా అనుకూలించని గరపనేలల్లోనూ తక్కువనీటితో ఈ పండ్లు సాగు చేయొచ్చని చెబుతున్నారు.  

యూట్యూబ్‌ చూసి.. సాగు చేసి 
కొందుర్గు మండలం ఉమ్మెంత్యాల గ్రామానికి చెందిన రైతు రవీందర్‌ రెడ్డి యూట్యూబ్‌ చూసి ఈ పంటను సాగుచేసి అధునాతన ఒరవడి సృష్టించాడు. సంగారెడ్డిలో ఓ రైతు సాగుచేసిన తోటను పరిశీలించి ఆయన అనుభవాలను తెలుసుకున్నాడు. డ్రాగన్‌ ఫ్రూట్స్‌ పీ పింక్‌ రకం మొక్కలు ఎంపిక చేసుకొని ఒక్కో మొక్కకు రూ.70 చొప్పున మాట్లాడుకొని 2 వేల మొక్కలు తెచ్చి మూడెకరాల్లో నాటాడు. ప్రస్తుతం మరో రెండువేల మొక్కలను స్వతహాగా తయారు చేసుకొని మరో మూడు ఎకరాల్లో నాటడంతోపాటు ఇతర రైతులకు మొక్కలను సిద్ధం చేశాడు. అతడిని చూసిన మరికొంతమంది రైతులు డ్రాగన్‌ తోటలను సాగుచేశారు. కేశంపేట, చేవెళ్ల, భూత్పూర్, మక్తల్, నారాయణపేట ప్రాంతాల్లోనూ డ్రాగన్‌ తోటలను సాగుచేస్తున్నారు. 

దిగుబడి, మార్కెటింగ్‌.. 
ఈ పంట సాగుచేసిన 8 నెలలకు దిగుబడి ప్రారంభమవుతుంది. ఒక పండు 600 నుంచి 700 గ్రాములు ఉంటుంది. ఒక్కో మొక్కకు దాదాపు 25 కిలోల పండ్లు వస్తాయి. హైదరాబాద్‌లోని ఫ్రూట్‌ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. కిలోకు రూ.150 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుందని రైతులు చెబుతున్నారు. 
 
చెరువులు తవ్వి.. చేపలు పెంచి 
మరోవైపు మరికొంతమంది రైతులు చెరువులను తవ్వి చేపల పెంపకంపై దృష్టి సారించారు. ఒక్కో చేప పిల్లకు రూ.16 చొప్పున ఖర్చుచేసి నల్లగొండ నుంచి మూడు నెలల వయస్సు గల చేప పిల్లలను తెచ్చి చెరువుల్లో వదిలారు. అర ఎకరం విస్తీర్ణంలో పదివేల వరకు చేపపిల్లలను పెంచొచ్చని తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దాణా వేయాలని, 8 నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో ఒక్కో చేప కిలో బరువు దాటుతుందని అంటున్నారు.   

రెండో ఏడాది నుంచి దిగుబడి  
డ్రాగన్‌ సాగుచేయడానికి మొదటగా పిల్లర్లు, డ్రిప్‌ల కోసం ఎకరాకు రూ.5 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొదటి ఏడాది కాస్తా దిగబడి తక్కువగా ఉన్నా రెండో ఏడాది నుంచి పెరుగుతుంది. మూడు, నాలుగేళ్ల సమయంలో ఎకరాకు 50 నుంచి 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఖర్చులు పోను ఎకరాకు రూ.5 లక్షల దాకా లాభం వస్తుంది. ఈ పంట 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. 
– రవీందర్‌రెడ్డి, రైతు, ఉమ్మెంత్యాల  

చేపల పెంపకంతో లాభాలు  
15 గుంటల విస్తీర్ణంలో చెరువు తవ్వి 10 వేల చేపపిల్లలను వదిలాను. గుంత తవ్వడం, కవర్‌ వేయడం, చుట్టూ కంచె వేయడానికి రూ.5 లక్షల ఖర్చు వచ్చింది. దాణాకు మరో రూ.10 లక్షలు అయ్యింది. తొమ్మిది నెలల్లో ఒక్కో చేపపిల్ల కిలో బరువు వచ్చింది. ప్రస్తుతం చెరువు వద్దే కిలో రూ.310 చొప్పున విక్రయిస్తున్నాను. ఇప్పటికి 500 కిలోలు అమ్మగా మరో 6 వేల కిలోల వరకు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది ఖర్చులు పోను రూ.5 లక్షల వరకు లాభం వస్తుంది. వచ్చే ఏడాది చేపపిల్లలు, దాణా ఖర్చు మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన అర ఎకరం విస్తీర్ణంలో చెరువును తవ్వి చేపలు పెంచితే 10 నెలలకు రూ.10 లక్షలు సంపాదించొచ్చు. 
– రాయికంటి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మెంత్యాల.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top