ధ్యాన గురువు సుభాష్‌ పత్రీజీ ఇకలేరు.. కోట్లాది మందిని ధ్యానం వైపు..  

Pyramid Guru Subhash Patriji Passed Away - Sakshi

అనారోగ్యంతో కన్నుమూత  

సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు  

ధ్యానంతో కడ్తాల్‌ కేంద్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన పత్రీజీ  

సాక్షి, రంగారెడ్డి జిల్లా/కడ్తాల్‌: ధ్యాన మంటే శ్వాసమీద ధ్యాస అని 40 ఏళ్ల పాటు అలుపెరగని ప్రచారం చేసి, కోట్లాది మందిని ఆధ్యాత్మికతవైపు మళ్లించిన ప్రముఖ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ (74) ఆదివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్‌ ధ్యాన కేంద్రంలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు అదే ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పిరమిడ్‌ ధ్యాన్‌ ట్రస్ట్‌ సభ్యులు ప్రకటించారు. పత్రీజీకి భార్య స్వర్ణమాల, కుమార్తెలు పరిణత, పరిమళ ఉన్నారు.  

కోట్లాది మందిని ధ్యానం వైపు.. 
సుభాష్‌ పత్రీజీ 1947లో బోధన్‌లోని శక్కర్‌నగర్‌లో పీవీ రమణారావు, సావిత్రీదేవిలకు జన్మించారు. తొలుత 1975లో ఓ బహుళజాతి ఎరువుల కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆధ్యాత్మిక సాధనలో భాగంగా 1980లో జ్ఞానోదయం పొందారు. ఆయన పొందిన జ్ఞానాన్ని, ధ్యానాన్ని ఇతరులకు పంచాలని భావించారు. ఈ మేరకు 1990లో కర్నూల్‌ స్పిరిచ్యువల్‌ సొసైటీ (పిరమిడ్‌ కేంద్రాన్ని) స్థాపించారు. అనేక మందిని ధ్యానులుగా, జ్ఞానులుగా మార్చారు. ధ్యానంతో పాటు జ్ఞానాన్ని ప్రజలకు పంచాలని భావించిన ఆయన రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ సమీపంలో 2008లో మహేశ్వర మహాపిరమిడ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2009 ఆగస్టు 15న పనులు ప్రారంభించారు. 2012 నుంచి ధ్యానమహా చక్రాలు ప్రారంభించారు. ఏటా లక్షలాది మందితో నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 వేలకుపైగా పిరమిడ్‌లను నిర్మించారు.  

దేహాన్ని విడిచి వెళ్తున్నట్లు ప్రకటన.. 
కొంతకాలంగా ఆయన మూత్ర పిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. 15 రోజుల క్రితం బెంగళూర్‌ నుంచి మహాపిరమిడ్‌ కేంద్రానికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ‘తాను ఆధ్యాత్మిక సేవ చేసేందుకే ఇక్కడికి వచ్చానని.. తాను లేకపోయినా తాను అందించిన ఈ ఆధ్యాత్మిక ప్రచారం నిర్విరామంగా కొనసాగుతుందని.. ఈ దేహాన్ని విడిచి వెళ్లే సమయం ఆసన్నమైంది’అని ప్రకటించారు. ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.  

సంతాప సూచికగా సంబురాలు 
పత్రీజీ నిష్క్రమణ ఆయన శిష్యులను ఆందోళనకు గురి చేసినా.. మరణాన్ని సైతం సంబురం చేసుకోవాలని ఆయన చేసిన సూచన ప్రకారం 3 రోజుల పాటు సంబురాలు నిర్వహించనున్నట్లు ధ్యానగురువులు ప్రకటించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top