మంచిర్యాలలో వ్యభిచార ముఠా గుట్టురట్టు

Prostitution Gang Arrested In Mancherial District - Sakshi

సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలో కొంతకాలంగా సాగుతున్న వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మరోవైపు పట్టణంలో కొంతకాలంగా బైక్‌ దొంగతనాలు చేస్తున్న అంతర్‌ జిల్లా బైక్‌ దొంగల ముఠాను కూడా అరెస్ట్‌ చేశారు. సంబంధిత వివరాలను స్థానిక ఏసీపీ కార్యాలయంలో సోమవారం డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని శ్రీనివాసకాలనీలో ఇంట్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు సీఐ లింగయ్య సిబ్బందితో కలిసి సోమవారం  తనిఖీలు చేశారు. మందమర్రికి చెం​దిన ఓ మహిళ సదరు ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నడిపిస్తున్నట్లు వెలుగుచూసింది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూర్‌ ప్రాంతాల నుంచి మహిళలను తెప్పిస్తున్నట్లు గుర్తించారు. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాల యువతుల ఆర్థిక ఇబ్బందులు గుర్తించి వారిని వ్యభిచారం వైపు నడిపిస్తున్నారని తెలి సింది.

విటులను రప్పించేందుకు దినేష్, రమేష్‌కు నెలకు రూ.15వేల వేతనం కూడా చెల్లిస్తున్నట్లు వెలుగుచూసింది. విటుల నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తూ రూ.500 సదరు మహిళలకు ఇప్పిస్తున్నట్లు బయటపడింది. తాజాగా ఇద్దరు మహిళలతో వ్యభిచారం కొనసాగిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిర్వాహకురాలితోపాటు 8మందిని అరెస్ట్‌ చేశారు. అరెస్టయినవారిలో కాగజ్‌నగర్‌కు చెందిన దినేష్, రమేష్, అబ్దుల్‌గఫర్, షేక్‌రియాజ్, షేక్‌ఇర్ఫాన్, అబ్బుదల్‌ జబ్బర్, జీషన్‌ఖాన్‌ ఉన్నారు. నిర్వాహకురాలి నుంచి రూ.15 వేల నగదు, ఏడు సెల్‌ఫోన్లు, కండోమ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువతులను సఖీ సెంటర్‌కు తరలించారు. 

అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్ట్‌
జిల్లా కేంద్రంలో తరచూ బైక్‌ దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సున్నంబట్టివాడ సమీపంలో ముగ్గురు వ్యక్తులు బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులో తీసుకుని విచారణ చేపట్టగా.. అంతర్‌ జిల్లా బైక్‌ దొంగల ముఠా వెలుగు చూసింది. ఇందులో ప్రధాన నిందితుడు బాలుడు కావడం విశేషం. ఇతడు గతంలో బైక్‌ల దొంగతనం, గంజాయి సరఫరా కేసులో సంరక్షణ గృహంలో ఉండి ఈ ఏడాది జూన్‌లో విడుదలయ్యాడు. అనంతరం అతడి మేనమామ, ములుగు జిల్లా వెంకటపురానికి చెందిన శ్రీకాంత్, ఆయన స్నేహితుడు, మంచిర్యాల జిల్లా గోపాల్‌వాడకు చెందిన ఈశ్వర్‌తో కలిసి బైక్‌లు దొంగిలిస్తున్నాడు.

వాటిని భూపాలపల్లి జిల్లా సుబ్బక్కపల్లికి చెందిన కిరణ్, మంచిర్యాల అశోక్‌రోడ్‌కు చెందిన మహేందర్‌లకు అమ్ముతుండేవారు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుండేవారు. వీరిపై మంచిర్యాల, మందమర్రి, లక్సెట్టిపేట, రామగిరి, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, నల్లబెల్లి, కాటారం పోలీస్‌స్టేషన్ల పరిధిలో 15 బైక్‌ దొంగతనాల కేసులు ఉన్నాయి. వీరినుంచి 15 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు బైక్‌దొంగలతోపాటు కొనుగోలు చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సీఐ లింగయ్య, ఎస్సైలు మారుతి, ప్రవీణ్‌కుమార్, రాజమౌళి గౌడ్, సిబ్బంది భరత్, దివాకర్, శ్రావణ్‌కుమార్, సీసీఎస్‌ సిబ్బందిని డీసీపీ అభినందించారు. 

బాలికపై లైంగికదాడి
వేమనపల్లి: ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన వేమనపల్లి మండలం జక్కెపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథ నం ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక కస్తూరి బాలో చదువుకుంటోంది.లాక్‌డౌన్‌ కావడంతో ఇంటివద్దే ఉంటోంది. రెండురోజుల క్రితం గ్రామంలో యక్షగాన నాటక ప్రదర్శన ఉండడంతో కుటుంబ సభ్యులు చూసేందుకు వెళ్లారు. దీనిని అదునుగా చూసిన అదే గ్రామానికి చెందిన పొర్‌తెట్టి అంజన్న బాలికను తన ఇంట్లోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇంటికి రాగా.. జరిగిన విషయాన్ని బాలిక వారికి తెలిపింది. వారు నీల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రహీంపాషా తెలిపారు.

అలుగును హతమార్చిన ఐదుగురు అరెస్ట్‌
జన్నారం(ఖానాపూర్‌): గ్రామ శివారులోకి వచ్చిన అటవీ అలుగును  హతమార్చిన ఐదుగురిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు రేంజ్‌ అధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... జన్నారం అటవీ డివిజన్‌ తాళ్లపేట్‌ రేంజ్‌ మేదరిపేట సెక్షన్‌ లోని దమ్మన్నపేట గ్రామ శివారులో అటవీ అలుగును పలువురు వేటాడినట్లు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం రేంజ్‌ అధికారి వెంకటేశ్వర్‌ రావు సిబ్బందితో కలిసి దమ్మన్నపేటలో డాగ్‌స్క్వాడ్‌తో సోదాలు చేయగా.. ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. కానీ అదే గ్రామానికి చెందిన శ్రీను అలియాస్‌ మచ్చశ్రీను ఇంట్లో అలుగు ఉందన్న సమాచారంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు అటవీ అధికారుల వాహనాన్ని అడ్డగించారు.

గ్రామ పెద్దల సహాయంతో శ్రీనును కార్యాలయానికి తీసుకువచ్చి విచారించగా అలుగును చంపినట్లు ఒప్పుకున్నాడు.  మూడు రోజుల ముందే దమ్మన్నపేట గ్రామ సమీపంలో వాగులోకి చేపలు పట్టేందుకు శ్రీనుతో పాటు చిన్ననర్సయ్య అలియాస్‌ చిరంజీవి, రాము అలియాస్‌ చింటు, భీమయ్య అలియాస్‌ బాలు, నరేశ్‌ చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వాగులో అటవీ అలుగు కనిపించగా.. ప్రాణంతో పట్టుకున్నారు. శ్రీనివాస్‌ ఇంట్లో అలుగును రెండ్రోజులపాటు ప్రాణంతో ఉంచారు. అటవీ అధికారులకు తెలిసిందని తేలడంతో అలుగును చంపి దొరికిన ప్రదేశంలోనే వదిలేసినట్లు రేంజ్‌ అధికారి తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top