కట్టిస్తామని కొట్టేస్తున్నారు.. రియల్‌ ఎస్టేట్‌లో పెరుగుతున్న ప్రీలాంచ్‌ బాధితులు  | Prelaunch Victims Growing Day By Day In Telangana Real Estate | Sakshi
Sakshi News home page

కట్టిస్తామని కొట్టేస్తున్నారు.. రియల్‌ ఎస్టేట్‌లో పెరుగుతున్న ప్రీలాంచ్‌ బాధితులు 

Sep 25 2022 3:00 AM | Updated on Sep 25 2022 8:04 AM

Prelaunch Victims Growing Day By Day In Telangana Real Estate - Sakshi

2019 జూన్‌లో అమీన్‌పూర్‌లోని శర్వాణి ప్రాజెక్టు టవర్‌–1లోని పదో అంతస్తులో రూ.25.30 లక్షలు, టవర్‌–14లో రూ.32 లక్షలు వంద శాతం సొమ్ము చెల్లించి రెండు ఫ్లాట్లు కొన్నాను. ఇప్పటివరకు నిర్మాణమే మొదలుపెట్టలేదు. కట్టిన డబ్బులు వెనక్కివ్వాలని రెండేళ్ల నుంచి చెప్పులరిగేలా తిరుగుతున్నా చిల్లిగవ్వ ఇవ్వలేదు. – శర్వాణి ప్రాజెక్టు బాధితుడు 

గుండ్లపోచంపల్లిలోని గ్రీన్‌హోమ్స్‌ టవర్‌–2లో గతేడాది నవంబర్‌లో ఒక్కోటీ రూ.32 లక్షలతో రెండు ఫ్లాట్లు తీసుకున్నాను. ఇప్పుడు అక్కడ ప్రాజెక్టు బోర్డు పీకేసి ఉంది. ఇదేమిటని భూయజమానిని సంప్రదిస్తే.. సాహితి సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అగ్రిమెంట్‌ రద్దు చేసుకున్నామని చెప్పారు. సాహితి ఆఫీసుకు వెళితే చడీచప్పుడు లేదు. – గ్రీన్‌హోమ్స్‌ ప్రాజెక్టు బాధితుడు 

గుండ్లపోచంపల్లిలో శిష్టా అడోబ్‌లో 2019 జూలైలో రూ.30.72 లక్షలు పెట్టి ఫ్లాట్‌ కొన్నాను. కానీ నిర్మాణమేదీ మొదలుపెట్టలేదు. కేవలం గుంతలు తీసి వదిలేశారు. ఇదేమిటని సాహితి కంపెనీ ఆఫీసుకు వెళితే ఎలాంటి స్పందనా లేదు. – శిష్టా అడోబ్‌ ప్రాజెక్టు బాధితుడు  

..ఇలా వేలాది మంది బాధితులు.. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొని లబోదిబోమంటున్నారు. ప్రీలాంచ్‌ ఆఫర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్‌ అంటూ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు మధ్యతరగతి ప్రజలను నిలువెల్లా ముంచుతున్నాయి. లక్షలు, కోట్లు వసూలు చేసి.. ఫ్లాట్లు కట్టి ఇవ్వకుండా, డబ్బూ తిరిగి ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నాయి. చిన్నచిన్న కంపెనీలే కాదు పేరున్న పెద్ద కంపెనీలూ ఇలా చేస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

మధ్య తరగతికి గాలమేస్తూ.. 
సాహితి, వాసవి, ఫీనిక్స్, సీఎన్‌ఎన్‌ వెంచర్స్, మంత్రి, ఏవీ ఇన్‌ఫ్రాకాన్, ఈఐపీఎల్, సుమధుర, సెన్సేషన్‌ ఇన్‌ఫ్రాకాన్, అర్బన్‌ రైజ్, భువనతేజ వంటి చాలా కంపెనీలు ఓపెన్‌ ప్లాట్లు, ఫామ్‌ ల్యాండ్స్, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలలో ప్రీలాంచ్‌ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అందమైన బ్రోచర్లు ముద్రించి అతి త్వరలో ప్రాజెక్టు సిద్ధమవుతుందంటూ గాలం వేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో, బయటా, మెట్రో రైళ్లలోనూ ప్రచారం హోరెత్తిస్తున్నాయి.

స్థానికులనే కాకుండా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని భావించే ప్రవాసులనూ బుట్టలో పడేస్తున్నాయి. కొన్ని బడా కంపెనీలు ప్రీలాంచ్‌ పేరిట పెద్దఎత్తున సొమ్ము వసూలు చేసి.. ఆ సొమ్ముతోనే స్థలాలు కొని, ఇప్పుడు నిర్మాణ అనుమతులకు వెళ్లినట్టుగా తమ దృష్టికి వచ్చిందని క్రెడాయ్‌ జనరల్‌ సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. 

ఆఫీసుల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు 
నిర్మాణ అనుమతులు రాకపోవటం, లీగల్‌ సమస్యలు, భూయజమానులతో ఒప్పందాలు రద్దు కావడం వంటి కారణాలతో ‘ప్రీలాంచ్‌’ వ్యవహారం అడ్డం తిరుగుతోంది. అటు ప్రాజెక్టు కట్టలేక, ఇటు డబ్బు తిరిగి ఇవ్వలేక బిల్డర్లు చేతులెత్తేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు పనులను ప్రారంభించకపోవడంతో.. బాధితులు తమ సొమ్ము వాపసు ఇవ్వాలంటూ బిల్డర్ల ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బిల్డర్లు వారిని రేపు, మాపు అంటూ తిప్పుతూనే ఉన్నారు.

ఫ్లాట్లు కొన్నవారి నుంచి ఒత్తిడి పెరగడంతో పలువురికి సాహితి యాజమాన్యం పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌లు ఇచ్చిందని, కానీ ఆ చెక్కులు బౌన్స్‌ అయ్యాయని ఓ బాధితుడు తెలిపారు. మూడేళ్లు గడిచినా ఏ ఒక్క ప్రాజెక్టులో పనులు మొదలవలేదని, పలు ప్రాజెక్టుల్లో భూయజమానితో ఒప్పందాలు కూడా రద్దయ్యాయని సాహితి సంస్థ బాధితులు వాపోయారు. 

భూయజమానికి తెలియకుండానే.. 
ఇక గుండ్లపోచంపల్లిలోని సర్వే నంబర్‌ 41/1/ఏఏ, 41/4లోని 5.125 ఎకరాలలో గ్రీన్‌హోమ్స్‌ ప్రాజెక్టు పేరిట ప్రీలాంచ్‌లో విక్రయాలు చేశారు. కానీ భూయజమాని వాటా ఫ్లాట్లను కూడా వారికే తెలియకుండా కంపెనీ అమ్మేసుకుంది. దీనితో కంగుతిన్న భూమి యజమానులు కంపెనీతో భూఒప్పందాలను రద్దు చేసుకున్నట్టు తెలిసింది. 

‘‘నార్సింగిలో వాసవి అట్లాంటిస్‌ ప్రాజెక్టులో రెండేళ్ల క్రితం ప్రీలాంచ్‌లో నాలుగు ఫ్లాట్లు బుక్‌ చేశాను. నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు. రెండేళ్లలో కేవలం సెల్లార్‌ పనులు పూర్తయ్యాయి. మిగతా డబ్బులు, జీఎస్టీ చెల్లిస్తే అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ చేస్తామని ఫోన్లు చేస్తున్నారు. ఎంఓయూ ప్రకారం ప్రీలాంచ్‌లో కొనుగోలు చేసిన కస్టమర్‌.. మధ్యలో ఫ్లాట్లను అమ్మడానికి వీల్లేదని షరతు పెట్టారు. ఒకవేళ అమ్మాలనుకుంటే మేనేజ్‌మెంటే నిర్మాణం పూర్తయ్యాక అమ్మి పెడుతుంది. వచ్చిన సొమ్ములో కొనుగోలుదారులకు కమీషన్‌ ఇస్తుందని షరతులు పెట్టారు..’’ అని ఓ బాధితుడు వాపోయారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement