వైద్యం వద్దు.. దేవుడే రక్షిస్తాడు.. చికిత్సకు నిరాకరించిన గర్భిణి

Pregnant Woman Not Ready To Join In Hospital In Adilabad - Sakshi

సాక్షి, నార్నూర్‌(ఆదిలాబాద్‌): ‘ఆస్పత్రికి రాను.. దేవుడికి మొక్కుకున్న.. అతడే రక్షిస్తాడు’ అంటూ వైద్యం చేయించుకునేందుకు గర్భిణీ నిరాకరించిన సంఘటన శనివారం మండలంలోని మహగావ్‌ శేకుగూడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శేకుగూడ గ్రామానికి చెందిన మేస్రం రేణుకబాయి 8 నెలల గర్భవతి. ఇది ఆమెకు మూడో కాన్పు. మొదటి రెండు కాన్పుల్లో హైబీపీ (అధిక రక్తపోటు) కారణంగా అబార్షన్‌ జరిగింది. ఈనెల 26న ఉట్నూర్‌ సామాజిక ఆస్పత్రిలో నెలవారి వైద్య పరీక్షలో భాగంగా ఆశ కార్యకర్త సదరు గర్భిణీని తీసుకెళ్లారు.

పరీక్షలు నిర్వహించిన గైనకాలజిస్ట్‌ మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు రెఫర్‌ చేశారు. అయితే ఆస్పత్రికి వెళ్లేందుకు రేణుకబాయి నిరాకరించింది. సూపర్‌వైజర్‌లు రాజమ్మ, చరణ్‌దాస్‌లు కౌన్సెలింగ్‌ చేసినా వైద్యానికి ఒప్పుకోలేదు. దీంతో శనివారం తహసీల్దార్‌ దుర్వా లక్ష్మణ్‌కు సమాచారం అందించారు. ఆయన గ్రామానికి చేరుకుని గోండ్‌ భాషలో నచ్చజెప్పారు. అయిన వినకుండా దేవుడికి మొక్కుకున్నానని, దేవుడే కాపాడుతాడని మొండికేసింది.

హైబీపీ ప్రభావం తల్లితో పాటు పుట్టబోయే బిడ్డపై పడుతుందని, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూనే వైద్యం చేయించుకోవాలని ఆయన కోరారు. ఆస్పత్రికి వెళ్లేదే లేదంటూ అందరూ ఉండగానే రేణుకబాయి గ్రామంలోని వేరే వాళ్ల ఇంటికి వెళ్లిపోయింది. ఆస్పత్రికి వెళ్లకుంటే వచ్చే అనార్థల గురించి అధికారులు, వైద్య సిబ్బంది రేణుకబాయి కుటుంబ సభ్యులకు వివరించారు. అయినా పూర్తిస్థాయి వైద్యానికి గర్భిణీ నిరాకరించింది. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలకు మాత్రమే ఆమె అంగీకరించింది. డిప్యూటీ తహసీల్దార్‌ అమృత్‌లాల్, ఆర్‌ఐ శకుంతల, సీడాం మల్కు పటేల్, మేస్రం జంగు, తొడసం బండు తదితరులు ఉన్నారు.  

చదవండి: Karimnagar: కీచకుడిగా మారిన ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్టు ఉద్యోగి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top