
జడ్చర్ల(మహబూబ్‌నగర్): పురిటి నొప్పులతో ప్రసవం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన నిండు గర్భిణి మృత్యువాత పడిన ఘటన జడ్చర్ల పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ వివరాల మేరకు.. రాజాపూర్ మండలం మల్లేపల్లికి చెందిన రేణుక (24)ను నవాబుపేట మండలం పల్లెగడ్డకు చెందిన నరేందర్‌కు ఇచ్చి వివాహం చేశారు.
వీరు హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో నివాసం ఉంటున్నారు. అయితే రేణుక మొదటి కాన్పు కోసం తల్లిదండ్రులు శుక్రవారం జడ్చర్ల ఇందిరానగర్ కాలనీలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి వైద్యురాలు ఆమెను పరీక్షించి జాయిన్ చేసుకున్నారు. రాత్రివేళ ఆకస్మికంగా ఆమెకు ఫిట్స్ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సదరు ఆస్పత్రి వైద్యురాలు మెరుగైన వైద్యం కోసం తన వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అక్కడి డాక్టర్లు ఆమెను పరీక్షించి.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, తన కూతురు మరణంపై ఎలాంటి అనుమానం లేదని తండ్రి వడ్డె పరశురాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉంటే, ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే తన భార్య రేణుక మృతిచెందిందని భర్త నరేందర్‌తో పాటు బంధువులు మొదట ఆరోపించారు. తన భార్యకు ఎప్పడూ ఫిట్స్ రాలేదని.. కానీ ఫిట్స్ వచ్చినట్లు తనకు ఫోన్‌లో తెలిపారన్నారు. విషయం తెలుసుకుని తాను ఆస్పత్రికి వచ్చే సరికే పేషంట్ కండీషన్ సీరియస్‌గా ఉందంటూ జిల్లా ఆస్పత్రికి తరలించారని తెలిపారు. కాగా, గర్భిణి మృతికి సంబంధించి సంబంధిత ఆస్పత్రి నిర్వాహకులు, మృతురాలి కుటుంబీకుల మధ్య చర్చలు సాగినట్లు సమాచారం.
గర్భిణి మృతిపై విచారణ..
గర్భిణి మృతిపై మాస్ మీడియా అధికారిణి మంజుల శనివారం విచారణ జరిపారు. సదరు ఆస్పత్రి డాక్టర్ నీలోఫర్ జగీర్ధార్‌తో వివరాలు సేకరించారు. అయితే వైద్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదని.. పరిస్థితి విషమంగా ఉండటంతో తన కారులో జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు వైద్యురాలు తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు చేపడుతామని మాస్ మీడియా అధికారిణి పేర్కొన్నారు.