900 మంది పీజీ వైద్య విద్యార్థులకు పోస్టింగ్‌ | Sakshi
Sakshi News home page

900 మంది పీజీ వైద్య విద్యార్థులకు పోస్టింగ్‌

Published Tue, Aug 23 2022 3:34 AM

Posting For 900 Medical Students In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తప్పనిసరి ప్రభుత్వ సేవల నిమిత్తం 900 మంది పీజీ మెడికల్‌ పూర్తయిన విద్యార్థులను వివిధ ప్రభుత్వ బోధన ఆస్పత్రుల్లో భర్తీ చేయనున్నారు. ఏడాది కాలం వారు ఆయా బోధనాస్పత్రుల్లో సేవలందించాల్సి ఉంటుంది. మొత్తం 25 స్పెషలిస్టు విభాగాలకు చెందిన పీజీ డాక్టర్లను నియమిస్తారు. ఈ మేరకు మంగళ, బుధవారాల్లో వైద్య విద్యా సంచాలకుల కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.

కౌన్సెలింగ్‌ మెరిట్‌ ఆధారంగా ఉంటుంది. అంటే పీజీ ఫైనల్‌ పరీక్షలో సాధించిన మొత్తం మార్కులను పరిగణలోకి తీసుకుని పోస్టింగ్‌ ఇస్తారు. విద్యార్థులు తమ వెంట పీజీ పాసైన సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డు తదితర పత్రాలు తీసుకురావాలి. ఏడాది కాలంలో మొత్తం 20 రోజుల సెలవులకు అనుమతి ఉంటుంది.

ఏడాది సర్వీస్‌కు రాని విద్యార్థులకు మెడికల్‌ కౌన్సిల్‌ శాశ్వత డిగ్రీ రిజిస్ట్రేషన్‌ ఇవ్వదు. పీజీ మెడికల్‌ డిగ్రీ పూర్తి చేసిన వెంటనే సూపర్‌ స్పెషాలిటీ డిగ్రీలో చేరినట్లయితే, అలాంటివారు సూపర్‌ స్పెషాలిటీ డిగ్రీ పూర్తయిన తర్వాత తప్పనిసరి సర్వీస్‌ చేయాలి. సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లుగా నియమితులైన వీరంతా వెంటనే కేటాయించిన పోస్టింగ్‌ ప్రాంతాల్లో రిపోర్ట్‌ చేయాలి. ఆయా ఆస్పత్రుల్లో బయోమెట్రిక్‌ పద్ధతిలో హాజరు ఇవ్వాలి.   

Advertisement
 
Advertisement
 
Advertisement