మాదిగలే మెజారిటీ | Population statistics in Telangana by sub-caste has become clear | Sakshi
Sakshi News home page

మాదిగలే మెజారిటీ

Apr 16 2026 4:11 AM | Updated on Apr 16 2026 4:11 AM

Population statistics in Telangana by sub-caste has become clear

కులగణన వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌. చిత్రంలో మంత్రి వాకిటి శ్రీహరి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎస్‌ రామకృష్ణారావు, స్పెషల్‌ సీఎస్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా

రాష్ట్రంలో ఉప కులాలవారీగా జనాభా చిత్రం తేటతెల్లం

రాష్ట్ర ప్రభుత్వం 2024లో నిర్వహించిన కుల, ఉద్యోగ, సామాజిక గణనలో తేలిన లెక్కలు

వివరాలు వెల్లడించిన మంత్రులు,పీసీసీ చీఫ్, సీఎస్‌..

రాష్ట్ర జనాభాలో ఉపకులాలే కీలకం

రాష్ట్ర మొత్తం జనాభా 3.54 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఉపకులాల వారీగా జనాభా చిత్రం స్పష్టమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల్లో ఏ కులం జనాభా ఎంత ఉందనే గణాంకాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ–రాజకీయ, కుల సర్వే (ఎస్‌ఈఈఈపీసీ–2024) వివరాలను బుధవారం ప్రభుత్వం బహిర్గతం చేసింది. అందులో భాగంగానే ఉపకులాల వారీగా జనాభా గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ నివేదికలో రాష్ట్రంలోని వందలాది ఉపకులాల జనాభా, వాటి శాతం, సామాజిక, ఆర్థిక స్థితి సూచికలు (సీబీఐ స్కోర్లు) వివరంగా పొందుపర్చారు. ఈ సమగ్ర సర్వేలో పలు కులాల మధ్య వ్యత్యాసాలు, అసమానతలు స్పష్టంగా బయటపడ్డాయి. 

పెద్ద ఉపకులాల ప్రాబల్యం 
ఈ సర్వే వెల్లడించిన గణాంకాల ప్రకారం కొన్ని ఉపకులాలు రాష్ట్ర జనాభాలో గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయి. అందులో మాదిగ కులం (ఎస్సీ) 36.57 లక్షల జనాభాతో (మొత్తం జనాభాలో 10.3 శాతం) అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత షేక్‌ ముస్లిం (బీసీ–ఈ) వర్గం 27.95 లక్షల (7.9 శాతం) జనాభా కలిగి ఉంది. ఆ తర్వాత వరుసగా ముదిరాజ్‌ 26.39 లక్షలు (7.4శాతం), లంబాడీ (బంజారా) 24.04 లక్షలు (6.8 శాతం), యాదవ (గొల్ల) 20.18 లక్షలు (5.7శాతం)తో అతిపెద్ద కులాలుగా నిలిచాయి. రాష్ట్రంలోని మరికొన్ని కులాలు కూడా పెద్ద సంఖ్యలో జనాభాను కలిగి ఉన్నాయని ఈ నివేదిక వెల్లడిస్తోంది. 


గౌడ సామాజిక వర్గం 16.30 లక్షల జనాభాతో (4.6శాతం), రెడ్డి వర్గం 17.10 లక్షల జనాభాతో (4.8 శాతం), మున్నూరు కాపు 13.75 లక్షల జనాభాతో (3.9 శాతం), పద్మశాలి 11.82 లక్షల జనాభాతో (3.3 శాతం) ఉన్నాయని, ఈ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా ప్రభావం చూపే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని సర్వే నివేదిక స్పష్టం చేస్తోంది. ఇక అనేక ఉపకులాలు చాలా తక్కువ జనాభాతో ఉన్నాయి. కొన్ని వర్గాలు 0.001% నుంచి 0.01% వరకు మాత్రమే జనాభా వాటాను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు ముండాల, పమిడి, సాంబన్‌ వంటి కులాల జనాభా వందల నుంచి వేల సంఖ్యలో మాత్రమే ఉందని నివేదిక చెబుతోంది. ఇవి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడే ప్రమాదంలో ఉన్నాయని సర్వే ఆధారంగా వెల్లడైన జనాభా గణాంకాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులు వెల్లడిస్తున్నాయి.  

 
బీసీ వర్గాల్లోనూ విస్తృత వైవిధ్యం 
సర్వేను నిశితంగా పరిశీలిస్తే.. బీసీ–ఏ నుంచి బీసీ–ఈ వరకు విభజించిన వెనుకబడిన వర్గాల్లో విపరీతమైన అసమానతలు కనిపిస్తున్నాయి. ఈ నివేదిక రాష్ట్రంలో కులాల మధ్య ఉన్న జనాభా అసమానతలతోపాటు సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలను స్పష్టంగా బయటపెట్టింది. పెద్ద కులాలు రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉండగా, చిన్న ఉపకులాలు అభివృద్ధి ప్రయోజనాలు అందుకోలేక వెనుకబడుతున్న పరిస్థితి స్పష్టమవుతోంది. సీబీఐ (కాంపోజిట్‌ బ్యాక్‌వర్డ్‌ ఇండెక్స్‌) స్కోర్లలో కూడా భారీ తేడాలు కనిపించాయి. 

కొన్ని వర్గాలు 100 పైగా స్కోర్లు సాధిస్తే, మరికొన్ని 40–50 మధ్యలోనే ఉండటం గమనార్హం. ఈ వ్యత్యాసం విద్య, ఉపాధి, ఆదాయ స్థాయిల్లో అసమానతలను సూచిస్తోంది. ఈ నేపథ్యంలో నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్న ఉపకులాలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు, వనరుల సమాన పంపిణీ, విద్య, ఉపాధి రంగాల్లో పలు సామాజిక వర్గాల వృద్ధి లక్ష్యంగా చర్యలు అవసరమని ఆ నివేదిక చెబుతోంది. అప్పుడే సమానాభివృద్ధి సాధ్యమవుతుందని అర్థమవుతోంది. 

రాష్ట్ర జనాభా 3.54కోట్లు 
రాష్ట్ర మొత్తం జనాభా 3.54 కోట్లు ఉన్నట్లు సర్వలో వెల్లడైంది. ఇందులో బీసీ జనాభా 1.64 కోట్లు. వీరితో పాటు ముస్లిం మైనార్టీల్లోని బీసీలు 35.76 లక్షలు. రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 46.25శాతం. ముస్లిం మైనార్టీల్లోని బీసీలను కలుపుకుంటే బీసీ జనాభా 56.33 శాతం. ఎస్సీ జనాభా 17.43శాతం, ఎస్టీ జనాభా 10.45 శాతం. రాష్ట్ర జనాభాలో ఓసీ జనాభా 15.79 శాతం ఉండగా... ఇందులో ముస్లిం మైనార్టీల్లోని ఓసీలు 2.48 శాతం. ఇతర ఓసీలు 13.31శాతం.  

ఆ 6 కులాల వద్దే అధిక భూమి 

తెలంగాణలో ఆసాములు ఎవరో తేలిపోయింది. ఏ సామాజిక వర్గం చేతిలో ఎంత భూమి ఉన్నదన్న గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే నివేదికలో వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం చూస్తే మొత్తం ఆరు కులాల చేతిలోనే రాష్ట్రంలోని 50 శాతం భూమి ఉన్నట్టు అర్థమవుతోంది. ఇందులో రాష్ట్ర జనాభాలో 4.8 శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి అత్యధికంగా 13.5 శాతం భూమి ఉంది. ఆ తర్వాత యాదవ,లంబాడా, ముదిరాజ్, మాదిగ, మున్నూరు కాపు సామాజిక వర్గాల చేతుల్లో ఎక్కువ భూమి ఉంది. ఇక రాష్ట్రంలోని మరో 31 కులాలకు కలిపి ఇంకో 30 శాతం భూమి ఉందని, ఇవికాక మిగిలిన అన్ని కులాలకు కలిపి మిగతా 20 శాతం భూమి ఉందని సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement