పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి

Police To Register Case Against In Disha Encounter Case: Lawyer In HC - Sakshi

నలుగురిని చంపినా కేసు నమోదు చేయలేదు 

హైకోర్టు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి 

‘దిశ’ ఎన్‌కౌంటర్‌ కేసులో పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు  

తదుపరి విచారణ జనవరి 2కు వాయిదా 

సాక్షి, హైదరాబాద్‌: ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ కేసులో పోలీసులు.. నలుగురు అనుమానితులను చంపినా వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని  పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణను హైకో ర్టు స్వీకరించింది. ఎన్‌కౌంటర్‌నుతప్పుబడుతూ సుప్రీంకోర్టులోనూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఓ కమిషన్‌ను నియమించింది. గత జనవరిలో కమిషన్‌ నివేదికను సమర్పించింది. ఈ నివేదికపై సుప్రీంకోర్టు గత మేలో విచారణ జరిపింది. ‘దిశ’ఎన్‌కౌంటర్‌ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మానిటర్‌ చేయలేదని తేల్చిచెబుతూ.. రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేసింది.

కాగా, హైకోర్టులోనూ ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేయాలని ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ క్రమంలో ‘దిశ’ఎన్‌కౌంటర్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది బ్రిందా గ్రోవర్‌ సుదీర్ఘ వాదనలు వినిపించారు. దిశ ఘటనకు సంబంధించిన వివరాలను కోర్టుకు తెలియజేశారు.  

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు..  
‘2019, నవంబర్‌ 27న చటాన్‌పల్లి వద్ద ఓ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఈ కేసులో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజుల జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న వీరిని 2019, డిసెంబర్‌ 6న పోలీస్‌ కస్టడీలోకి తీసుకున్నారు. ఇదే రోజు ఘటనా స్థలానికి వారిని తీసుకెళ్లారు. అక్కడ తమపై నిందితులు దాడి చేశారంటూ పోలీసులు వారిని ఎన్‌కౌంటర్‌ చేశారు.

అయితే ఈ ఎన్‌కౌంటర్‌ బూటకమా.. లేక నిజంగా ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారా.. అనే దానిపై నిజాలు నిగ్గుతేల్చాలని పలు హక్కుల సంఘాలు హైకోర్టు సీజేకు లేఖ రాశాయి. పారదర్శకంగా, స్వేచ్ఛాయుత విచారణ జరిపేలా చూడాలని కోరాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఈ ఎన్‌కౌంటర్‌పై హైపవర్‌ కమిషన్‌ను నియమించింది.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2021 ఆగస్టు నుంచి డిసెంబర్‌ వరకు విచారణ జరిగిన ఈ కమిషన్‌.. 2022, జనవరి 28న నివేదికను సమర్పించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 2022, మే 20న ఈ కేసు విచారణ బాధ్యతను హైకోర్టుకు అప్పగించింది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న మొత్తం పది మంది పోలీసు అధికారులను సెక్షన్‌ 302 ఆర్‌/డబ్ల్యూ 34 ఐపీఎస్, 201 ఆర్‌/డబ్ల్యూ, 302 ఐపీఎస్, 34 ఐపీఎస్‌ కింద విచారణ జరపాలని కమిషన్‌ సూచించింది.

కమిషన్‌ నివేదిక మేరకు ఆ పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఈ కోర్టు ఆదేశించాలి. నలుగురు అనుమానిత వ్యక్తులపై కేసు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్‌ సమ ర్పించిన పోలీసులు.. నలుగురిని చంపిన వారి పై మాత్రమే కేసు నమోదు చేయలేకపోవడం చట్టవిరుద్ధం. పీయూసీఎల్‌ తీర్పులో నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించాలని హైకోర్టు ఆదేశించినా దాన్ని పాటించలేదు.

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పుల మేరకు పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసులోనూ పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయమని ఆదేశించేందుకు హైకోర్టుకు సర్వాధికారాలున్నాయి. ఎన్‌కౌంటర్‌ జరిగిన వెంటనే సీపీ ప్రెస్‌మీట్‌ పెట్టి.. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’అని అనడం ఎన్‌కౌంటర్‌ కావాలనే చేశారనేందుకు బలం చేకూర్చుతోంది’ అని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే జనవరి 2కు వాయిదా వేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top