అప్రమత్తంగా ఉండండి: డీజీపీ

Police Department Is On High Alert On Rains Across Telangana State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలపై పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. వర్షాలు, వరదల వల్ల సాధ్యమైనంత వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ ఎం.మహేందర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల పోలీసు అధికారులనూ సిద్ధం చేయడంతో పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. సీఎస్‌తో కలసి కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్‌ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూముల్లో పోలీస్‌ అధికారులను నియమించినట్లు చెప్పారు. (ఊళ్లన్నీ జలదిగ్బంధం)

మరో రెండ్రోజులు వర్షాలు 
సాక్షి, హైదరాబాద్‌: వాయవ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అలాగే కొనసాగుతుండటంతో రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని 4, 5వ హెచ్చరికలను ఆదివారం జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతోనే రాష్ట్రంలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే 24 గంటల్లో ఈ అల్పపీడనం బలహీనపడే అవకాశమున్నట్లు తెలిపింది. దీంతో వర్షాల తీవ్రత కొంచెం తగ్గినప్పటికీ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

19న మరో అల్పపీడనం..: ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతోనూ రాష్ట్రంలో మెస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. అయితే 19న ఈ అల్పపీడనం ఏర్పడితే అది బలపడే పరిస్థితిని బట్టి వర్షపాతాన్ని అంచనా వేస్తారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top