బండి సంజయ్‌ కుమారుడిపై పోక్సో కేసు.. విచారణకు ప్రత్యేక టీమ్‌ | POCSO Case Filed Against Bandi Sanjays Son | Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌ కుమారుడిపై పోక్సో కేసు.. విచారణకు ప్రత్యేక టీమ్‌

May 11 2026 4:08 PM | Updated on May 11 2026 5:02 PM

POCSO Case Filed Against Bandi Sanjays Son

హైదరాబాద్: పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. తన కుమార్తెని లైంగికంగా వేధించారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, తనని హనీట్రాప్‌ చేశారని కరీంనగర్‌ టూటౌన్‌ పీఎస్‌లో భగీరథ్‌ ఫిర్యాదు చేశారు. భగీరథ్‌ ఫిర్యాదుతో బాలిక, ఆమె తల్లిదండ్రులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఈ మేరకు మెమో జారీ చేసింది. ‘‘సైబరాబాద్ కూకట్‌పల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రితిరాజ్ పెట్-బషీరాబాద్ పోలీస్ స్టేషన్ క్రైం నెం. 684/2026లో బీఎన్‌ఎస్ 74, 75 సెక్షన్లు, పోక్సో 12 సెక్షన్ కింద నమోదైన కేసు దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాం.

దర్యాప్తు సరైన, నిష్పాక్షిక, వృత్తిపరమైన విధానంలో సాగేటట్లు చూసి, కేసుకు సంబంధించిన అన్ని అంశాలను నిర్లక్ష్యం లేకుండా, ఎటువంటి తప్పుదారి పట్టింపు లేకుండా పరిశీలించాల్సిందిగా ఆమెకు ఆదేశాలు ఇచ్చాం. దర్యాప్తు పురోగతిని డీసీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించి, ప్రతిరోజూ దర్యాప్తు నివేదికపై సంతకం చేసిన అధికారికి తప్పనిసరిగా సమర్పించాలి’’ అని పేర్కొంది.

ఇదిలా ఉంటే బండి భగీరథ్‌ వ్యవహారంపై సీఎం రేవంత్‌ ఆరా తీస్తున్నారు. కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్‌ సీఎంకు వివరించారు. సమగ్ర విచారణకు స్పెషల్‌ టీమ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పోలీసులు బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement