మరోసారి రాష్ట్రానికి మోదీ.. త్వరలోనే వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కు ప్రారంభం!  | Sakshi
Sakshi News home page

PM Modi: మరోసారి రాష్ట్రానికి మోదీ.. త్వరలోనే వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కు ప్రారంభం! 

Published Sun, May 7 2023 4:21 AM

PM Modi Visit Telangana Once Again Upcoming Days - Sakshi

‘మిష­న్‌ తెలంగాణ’లో భాగంగా రాష్ట్రంలో మరోవిడత వరు­స పర్యటనలు, కార్యక్రమాలకు బీజేపీ అధినాయకత్వం సిద్ధమవుతోంది. ఇప్పటి­దాకా కర్ణాటక ఎన్నికల్లో బిజీగా ఉన్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, ఇ­తర ముఖ్యనేతలు.. ఇక తెలంగాణపై ఫోకస్‌ చేయనున్నారు. సోమవారం కర్ణాటకలో ఎ­న్నికల ప్రచా­రం ముగుç­Ü్తుండటంతో.. ఆ మరు­సటి రో­జున (ఈ నెల 9న) కర్ణాటక సరిహద్దులో ఉన్న తెలంగాణ ప్రాంతాల్లో అమిత్‌ షా లేదా జేపీ నడ్డాతో సభ నిర్వహించే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

దక్షిణాదిలో పార్టీ విస్తరణకు కర్ణాటకలో గెలుపు కీలకమని.. అక్కడ ఓట్లు పొందే ఏ అవకాశాన్నీ వదులుకోరాదనే వ్యూహం మేరకే సరిహద్దుల్లో సభ నిర్వహించే యోచన ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. కర్ణాటక ఎన్నికల కోడ్‌తో ఇబ్బందిలేకుండా.. జహీరాబాద్, నారాయణపేట్‌ లేదా మరోచోట సభ నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. 

త్వరలో ఎన్నికలు ఉండటంతో.. 
తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో వివిధ వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు అవసరమైన రాజకీయ వ్యూహాలకు బీజేపీ అగ్రనేతలు పదును పెడుతున్నారు. కేసీఆర్‌ సర్కార్‌పై విమర్శల దాడిని కొనసాగించడంతోపాటు కేంద్ర మంత్రులు, ముఖ్య నేతల పర్యటనల ద్వారా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. కేంద్ర పథకాల ద్వారా వివిధ రంగాల్లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రజలకు కలిగిన లబ్ధి తదితర అంశాలను క్షేత్రస్థాయిలో వివరించాలని నిర్ణయించారు. 

వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రారంభం కోసం.. 
గత నెల 8న హైదరాబాద్‌లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఈ నెలలో వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్కు ప్రారంభోత్సవానికి రానున్నారు. తెలంగాణలో పట్టు కోసం అమలు చేస్తున్న వ్యూహాల్లో భాగంగా.. వచ్చే ఆరు నెలల్లో మోదీ నెలకోసారి, అమిత్‌షా ఒకట్రెండు సార్లు, నడ్డా కనీసం నెలకు రెండుసార్లు పర్యటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే మోదీ పర్యటన జరగనుంది. ఈ నెలలోనే రాష్ట్రంలోని రెండు ఎంపీ సీట్ల పరిధిలో జేపీ నడ్డా పర్యటించనున్నారని.. ఈ నెలాఖరులో లేదా వచ్చేనెల మొదట్లో అమిత్‌షా పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక పార్లమెంట్‌ ప్రవాసీ యోజనలో భాగంగా పలు లోక్‌సభ, అసెంబ్లీ సెగ్మెంట్లలోని పార్టీ కమిటీల్లో నియామకాలను పూర్తి చేయడంపై పెద్దలు దృష్టిపెట్టారు.   

Advertisement
Advertisement