పెట్రోలుబంకు కార్మికుడికి రోబోటిక్ కిడ్నీ మార్పిడి | World’s First Kidney Transplant with CMR Robot at Kamineni Hospital Hyderabad | Sakshi
Sakshi News home page

పెట్రోలుబంకు కార్మికుడికి రోబోటిక్ కిడ్నీ మార్పిడి

Oct 28 2025 3:56 PM | Updated on Oct 28 2025 4:25 PM

Petrol station worker undergoes robotic kidney transplant

•    కామినేనిలో తొలిసారి ఈ తరహా శస్త్రచికిత్స
•    సాధారణ పద్ధతితో పోలిస్తే నొప్పి చాలా తక్కువ
•    అత్యంత కచ్చితత్వంతో చేసిన సీఎంఆర్ రోబో
•    ఈ రోబోతో ప్రపంచంలో ఇదే మొదటి కిడ్నీ మార్పిడి

హైదరాబాద్: రంగారెడ్డి.. ఓ సాధారణ పెట్రోలుబంకు కార్మికుడు. అతడి వయసు 45 ఏళ్లు. అయితే, అధిక రక్తపోటు (బీపీ) ఉన్న విషయాన్ని సరిగా గమనించుకోలేదు. గుర్తించేసరికే రెండు కిడ్నీలు పాడైపోయాయి. కొన్నాళ్లుగా డయాలసిస్ చేయించుకుంటూ కిడ్నీ మార్పిడి కోసం ప్రయత్నించాడు. కుటుంబసభ్యులలో ఎవరిదీ సరిపోకపోవడంతో జీవన్‌దాన్ లో పేరు నమోదుచేయించుకున్నాడు. అందులో కిడ్నీ అందుబాటులోకి రావడంతో ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ వి. సూర్యప్రకాష్ తెలిపారు.

“రంగారెడ్డికి అధిక రక్తపోటు కారణంగా రెండు కిడ్నీలూ పాడయ్యాయి. దీర్ఘకాల కిడ్నీవ్యాధితో బాధపడుతున్న అతడికి మార్పిడి తప్పనిసరి అయ్యింది. జీవన్దాన్లో కిడ్నీ దొరకడంతో కామినేని ఆస్పత్రిలో అతడికి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం. అయితే, సాధారణ శస్త్రచికిత్సలో అయితే పెద్ద కోత పెట్టాల్సి రావడం, ఇతర సమస్యలు ఉంటాయని.. సీఎంఆర్ సర్జికల్ రోబోతో అతడికి కిడ్నీ మార్పిడి చేయాలన్న నిర్ణయానికి వచ్చాం. కామినేని ఆస్పత్రిలో రోబోటిక్ పద్ధతిలో కిడ్నీమార్పిడి చేయడం ఇదే మొదటిసారి. అంతేకాదు.. సీఎంఆర్ రోబోతో ఈ శస్త్రచికిత్స చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. దీన్ని విజయవంతంగా నిర్వహించాం.

రోబోటిక్ పద్ధతి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా చిన్న కోత, కణజాలాలకు నష్టం తక్కువ ఉండడం, రక్తస్రావం కూడా అతి తక్కువ ఉండడం లాంటి ప్రయోజనాలుంటాయి. పైపెచ్చు కచ్చితత్వం నూటికి నూరుశాతం ఉంటుంది. రోబోటిక్ ఆర్మ్స్ ను ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండదు. నొప్పి చాలా తక్కువ ఉండడంతో ఆస్పత్రిలో ఎక్కువ కాలం ఉండక్కర్లేదు, వేగంగా కోలుకుని తమ పనులు చేసుకోవచ్చు. ఊబకాయం ఉన్నవారికి ఇది మరింత సానుకూలం.

సీఎంఆర్ రోబో ఏంటి..
కామినేని ఆస్పత్రిలో ఉన్న సీఎంఆర్ వెరిసస్ సర్జికల్ రోబో అనేది అత్యంత ఆధునికమైన రోబోటిక్     వ్యవస్థ. దీని సాయంతో రోబోటిక్ రాడికల్ ప్రోస్టేటెక్టమీ, రాడికల్ సిస్టో ప్రోస్టేటెక్టమీ, ఇంట్రాకార్పొరియల్ యూరినరీ డైవర్షన్, పైలోప్లాస్టీ, పార్షియల్ నెఫ్రక్టమీ లాంటి ఆధునిక శస్త్రచికిత్సలన్నీ పూర్తి కచ్చితత్వంతో విజయవంతంగా చేయొచ్చు” అని డాక్టర్ వి.సూర్యప్రకాష్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement