BJP MLA Raja Singh: రాజా సింగ్‌పై పీడీ యాక్ట్‌.. ఈ చట్టం ఉద్దేశం ఏంటి?

PD Act Invoked Against BJP MLA Raja Singh, Whats Says This Act - Sakshi

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌ తెలంగాణ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా చేసిన ఆయన వ్యాఖ్యలు భాగ్యనగరంలో అలజడి సృష్టించాయి. గత వారం రోజుల్లో రెండు సార్లు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈసారి ఆయనపై ఏకంగా పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. మంగళహాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో గతంలో రాజాసింగ్‌పై రౌడీషీట్‌ ఉండటంతో పీడి యాక్ట్ నమోదు చేసినట్టు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్‌ నమోదవడం ఇదే తొలిసారి. ఈక్రమంలో పీడీ యాక్ట్‌ హాట్‌ టాపిక్‌ అయింది. ఇంతకూ పీడీ చట్టం అంటే ఏంటి?  దీనిని ఎలాంటి సందర్బాల్లో ఉపయోగిస్తారు.. అసలు ఈ చట్టం ఉద్ధేశం ఏంటో తెలుసుకుందాం. ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ యాక్ట్‌ (పీడీ యాక్ట్‌) ను మన దేశంలో 1950లో అమల్లోకి తీసుకొచ్చారు. పేరుమోసిన నేరస్థులను ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచడానికి పోలీసులు అమలు చేసే చట్టం ఇది. ఈ చట్టం ద్వారా ఒక వ్యక్తిని కనీసం మూడు నెలల నుంచి గరిష్టంగా 12 నెలల వరకు జైలులో నిర్బంధించవచ్చు.

విద్వేషపూరిత ప్రసంగం, అల్లర్లు, విచక్షణారహిత హింస, తీవ్రవాదం, అంతర్రాష్ట్ర దొంగలు, హంతకులు, ఆన్‌లైన్‌ మోసగాళ్లు, వ్యభిచార నిర్వహణ, మాదక ద్రవ్యాల ముఠాలు.. ఇలా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై దీన్ని ప్రయోగిస్తారు. ప్రజల భద్రతలకు హాని కలిగించడం.. సమాజానికి ముప్పుగా పరిణమించే వారిపై ఈ చట్టాన్ని బ్రహ్మాస్త్రంగా వినియోగిస్తారు. నేరాల అదుపునకు విచారణ అవసరం లేకుండా వ్యక్తులను కట్టడి చేయడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.

తెలంగాణలో మరిన్ని
తెలంగాణ ప్రభుత్వం 2018లో ఈ చట్టానికి సవరణలు చేసింది. అదనంగా.. కల్తీ విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువులు, ఆహార పదార్థాల కల్తీ, గేమింగ్‌, లైంగిక నేరాలు, పేలుళ్లు, ఆయుధాలు, వైట్‌కాలర్‌ ఆర్థికనేరాలు, అటవీ నేరాలు, నకిలీ పత్రాల తయారీ తదితరాలను దీని పరిధిలోకి తెచ్చింది. 2018లో మొత్తం 385 మందిపై, 2020లో 350 మందిపై ఈ చట్టం కింద కేసులు పెట్టారు. 

అయితే పీడీ చట్టంపై విమర్శలూ ఎక్కువే. వ్యవస్థీకృత నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలన్న ఉద్ధేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం దుర్వినియోగానికి గురవుతూ విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. తీవ్రమైన నేరాలు చేసి.. సమాజ భద్రతకు ముప్పుగా మారే అవకాశమున్నవారిపై ఉపయోగించాల్సిన ఈ యాక్ట్‌ను చిల్లర దొంగతనాలు, చిట్టీల వ్యాపారాలు, వ్యభిచార నేరాలకు పాల్పడినవారిపైనా ప్రయోగించి పోలీసులు విమర్శలు ఎదుర్కొన్న దాఖలాలున్నాయి. క్రిమినల్‌ లా ప్రకారం వారిని విచారించి శిక్షించాల్సింది పోయి పీడీ చట్టం కింద ఏడాది పాటు జైలులో పెట్టడమే లక్ష్యంగా దీన్ని వినియోగిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఎక్కువే. నిర్బంధమే లక్ష్యంగా ఈ చట్టాన్ని వినియోగించడం రాజ్యాంగంలోని అధికరణ 21కి విరుద్ధమే! (క్లిక్‌: ఒక్క ఉప ఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top