పార్టీయే సుప్రీం | Party Is The Supreme Says Manikyam Thakur | Sakshi
Sakshi News home page

పార్టీయే సుప్రీం

Sep 29 2020 2:23 AM | Updated on Sep 29 2020 2:33 AM

Party Is The Supreme Says Manikyam Thakur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీలో ఎవరికి ఎలాంటి వ్యక్తిగత అభిప్రాయా లున్నా... అందరూ పార్టీ నిర్ణయా లను శిరసా వహించాల్సిందేనని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ స్పష్టం చేశారు. పార్టీయే సుప్రీం అన్నారు. పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికయినా అన్ని స్థాయిల్లోని నేతలు కట్టుబడి ఉండాల్సిందేనని, పార్టీయే ఫైనల్‌ అని ఆయన చెప్పారు. 2023 నాటికి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తమ మిషన్‌ అని, అది అంత కష్టసాధ్యమేమీ కాదని, అధికారానికి కేవలం రెండడుగుల దూరంలోనే ఉన్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటి మెంట్‌తో టీఆర్‌ఎస్‌ గెలిచింది. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి ప్రజలను మరోసారి తన వైపునకు మరల్చుకోగలిగింది. అయితే ప్రతి పదేళ్లకోసారి రాష్ట్రాల్లో అధికారం మారుతూ ఉంటుంది. 2023 ఎన్నికల్లో మేం అధికారంలోకి వస్తాం’ అని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర పర్యటనలో భాగంగా మూడోరోజు సోమ వారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టి మాట్లా డుతూ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, భవిష్యత్‌ కార్యా చరణ, తన పర్యటన అనుభవాలను పంచు కున్నారు. గత మూడు రోజులుగా రాష్ట్రం లోని అన్ని స్థాయిల పార్టీ నేతలతో మాట్లాడా నని, వారి నుంచి సానుకూల ఫీడ్‌బ్యాక్‌ వచ్చిందన్నారు. ఇతర రాష్ట్రా లతో పోలిస్తే తెలంగాణలో కాం గ్రెస్‌ పార్టీ బలంగా ఉందని, గట్టి నాయకత్వం ఉందని చెప్పారు. అందరూ నిర్మాణాత్మకంగా పనిచేయాల్సి ఉందని, పార్టీపరంగా తెలంగాణలో పరిస్థితిని అవ గాహన చేసు కుంటున్నానని చెప్పారు. రాష్ట్ర పార్టీ నేతల మధ్య మంచి సంబంధాలు, సఖ్యత అవసరమన్నారు. ఐక్యత అనేది అన్ని స్థాయిల్లో అవసరమని చెప్పారు. 

మాకు కొన్ని పద్ధతులుంటాయి
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలపై ఆయన మాట్లాడుతూ... అన్ని ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతోందని చెప్పారు. అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కాంగ్రెస్‌లో ప్రాంతీయ పార్టీల తరహాలో ఉండదని, దానికి కొన్ని పద్ధతులుంటాయన్నారు. అయినా అభ్యర్థి ఎంపిక ముఖ్యం కాదని, గెలుపు ముఖ్యమని చెప్పారు. కుందేలు ఎంత ఉరికినా గెలిచేది తాబేలేనని, అధికార టీఆర్‌ఎస్‌ డబ్బులతో ఎన్నికలకు వెళ్తే తాము ప్రజలపై నమ్మకంతో వెళ్తామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాంకు మద్దతిచ్చే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దీనిపై పార్టీ ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

గత ఎన్నికల్లో పెట్టుకున్న పొత్తులకు తెరపడిందన్న వార్తల్లో వాస్తవం లేదని, ఫ్రెండ్లీ పార్టీలతో సత్సంబంధాలు కొనసాగిస్తామని మాణిక్యం చెప్పారు. పార్టీలో అంతర్గతంగా యువతను ప్రోత్సహిస్తామని, వారికి మంచి అవకాశాలిస్తామని వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడి మార్పుపై ప్రశ్నించగా, ఆ విషయంపై తాను మాట్లాడలేనని, అది పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారమని, దానిపై సోనియా గాంధీనే నిర్ణయం తీసుకుంటారన్నారు. రాష్ట్రంలో రాజకీయం స్థానికే నేతలే చేస్తారని, తాను వారికి వెన్నుదన్నుగా ఉంటానని వ్యాఖ్యానించారు. 

ఇద్దరూ ఎమోషనల్‌
తెలుగు, తమిళ భాషలు మాట్లాడే ప్రజలకు భావోద్వేగం ఎక్కువని మాణిక్యం అభిప్రాయపడ్డారు. అయితే, తెలంగాణ రాజకీయాలకు, తమిళనాడు రాజకీయాలకు తేడా ఉంటుందని, అక్కడి మోడల్‌ ఇక్కడ వర్కవుట్‌ కాదని చెప్పారు. యువత గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఎంపీ రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని ‘మా ఇంచార్జే యూత్‌’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు స్పందించిన మాణిక్యం తనకు 45 ఏళ్లు ఉన్నాయని, తాను యూత్‌ కాదని, కాంగ్రెస్‌ పార్టీలో 35 ఏళ్ల వరకే యూత్‌ అని చెప్పారు.

తాను తెలంగాణకు కొత్త అని, తెలుగు నేర్చుకుంటున్నానని చెప్పారు. వారానికి మూడు పదాల చొప్పున నేర్చుకుంటున్నానని, ఏడాదిలో తెలుగు మాట్లాడతానని,. తన లోక్‌సభ నియోజకవర్గంలోనూ తెలుగు మాట్లాడే ప్రజలున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ పనితీరును క్రికెట్‌ టీంతో ఎందుకు పోల్చారని ప్రశ్నించగా, అందరికీ సులభంగా అర్థమవుతుందనే అలా చెప్పానని, క్రికెట్‌లో అందరూ కలిసి ఆడితేనే విజయం సాధిస్తారని, రాజకీయంలోనూ అదే పద్ధతి మంచిదని మాణిక్యం అభిప్రాయపడ్డారు. మాణిక్యంతో పాటు ఉత్తమ్, రేవంత్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement