గాంధీలో ఫైర్‌ సేఫ్టీ నిల్‌

Old Fire Saftey Rules in Gnadhi Hospital Hyderabad - Sakshi

గాంధీఆస్పత్రి: కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఫైర్‌సేఫ్టీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. ఇక్కడ  అగ్నిప్రమాదం జరిగితే  ఘోరమైన పరిణామాలు సంభవిస్తాయని సంబంధిత నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రౌండ్‌ ప్లస్‌ ఎనిమిది అంతస్తుల్లో నిర్మించిన ఇన్‌పేషెంట్‌ భవనంలో అగ్నిప్రమాదం జరిగితే వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు, అందిస్తున్న వైద్యులు, సిబ్బంది బయటకు వెళ్లే దారిలేక అగ్నికీలల్లో మాడి మసై పోవాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. సుమారు 17 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఫైర్‌సేఫ్టీ సిస్టం పూర్తిగా పనిచేయడంలేదు. అగ్ని నిరోధక పరికరాల్లో కొన్ని తుప్పు పట్టి, మరికొన్ని దొంగతనానికి గురికావడంతో అక్కడక్కడ దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి.

గతేడాది ఆగస్ట్‌ 6వ తేదీన పిడియాట్రిక్స్‌ సర్జరీ విభాగంలో అగ్నిప్రమాదం జరిగి కోట్లాదిరూపాయల విలువైన వైద్య యంత్రాలు, సామాగ్రి కాలిబూడిదైంది. గత రెండేళ్లలో సుమారు 15 అగ్ని ప్రమాదాలు సంభవించాయని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం వెయ్యి మందికి పైగా కరోనా పాజిటివ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. మరో రెండు వేలమంది వైద్యులు, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది విధులు నిర్వహిసున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాదంతోనైనా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వైద్య ఉన్నతాధికారులు స్పందించి గాంధీ ఆస్పత్రిలో ఫైర్‌సేఫ్టీ వ్యవస్థను పటిష్టం చేయాలని పలువురు కోరుతున్నారు.  

డిజైన్‌ లోపం...మెట్ల దారులన్నీ లోపలికే....  
ఎనిమిది అంతస్తుల్లో నిర్మించిన ప్రధానభవనం డిజైన్‌లోనే లోపం ఉన్నట్లు ఇంజనీరింగ్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అగ్నిప్రమాదంతో పాటు, విపత్కర పరిస్థితులు సంభవిస్తే భవనం నుంచి బయట పడేందుకు వెలుపల వైపుకు తప్పనిసరిగా మెట్లు ఏర్పాటు చేయాలి. నాలుగు వైపులా బంధించినట్లు నిర్మించిన భవనంలో ర్యాంపు తోపాటు మూడు చోట్ల ఏర్పాటు చేసిన మెట్ల దారులన్నీ భవనం లోపలికే ఉండడంతో ప్రమాదం జరిగితే పది శాతం మంది కూడా ప్రాణాలతో బయటపడే అవకాశమే లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అత్యవసర, అవుట్‌పేషెంట్‌ విభాగ భవనాలకు వెనుకవైపు నుంచి మెట్లదారి ఏర్పాటు చేసినప్పటికీ ఆయా ద్వారాలకు నిత్యం తాళం వేసి ఉండడం గమనార్హం.  

17 ఏళ్ల క్రితం నాటి ఫైర్‌సేఫ్టీ వ్యవస్థ.. 
2003లో గాంధీఆస్పత్రి నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన ఫైర్‌సేఫ్టీ వ్యవస్థే నేటికి కొనసాగుతోంది. చాలా వరకు పరికరాలు తుప్పుపట్టిపోగా, మరికొన్ని దొంగతనాలకు గురయ్యాయి. అగ్నిమాపక రక్షణ వ్యవస్థ పనిచేయడంలేదని, ఫైర్‌ఫైటింగ్‌ సిస్టం, స్మోక్‌ డిటెక్టివ్స్‌ ఏర్పాటు చేయాలని పలుమార్లు ప్రభుత్వానికి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులకు లిఖితపూర్వకంగా కోరినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఫైర్‌సేఫ్టీ వ్యవస్థకు సంబంధించిన ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని ఆస్పత్రికి చెందిన కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.  

ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు 
గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. అగ్నిమాపక రక్షణ వ్యవస్థ విషయమై పలుమార్లు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా లేఖలు రాశాం. అత్యాధునిక ఫైర్‌సేఫ్టీ వ్యవస్థను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. 
– ప్రొఫెసర్‌ రాజారావు, గాంధీ సూపరింటెండెంట్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top