వారియర్స్‌కు వ్యాక్సిన్‌... అక్కర్లేదు

NIMS Scientist Dr Madhu Mohan Rao Interview On Covid 19 Vaccination - Sakshi

కరోనా వచ్చిపోయాక వ్యాక్సిన్‌ వేస్తే దుష్ప్రభావాలు

మన కణాలే మనపై దాడి చేసే ప్రమాదం..

17 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్‌ అవసరమే లేదు

నిమ్స్‌ పరిశోధన, అభివృద్ధి విభాగం అధిపతి

డాక్టర్‌ మధుమోహన్‌రావుతో ‘సాక్షి’ ఇంటర్వూ్య

కరోనా వ్యాక్సిన్‌ దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు దాదాపు వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. అందుకు రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అయితే వ్యాక్సిన్ల సామర్థ్యంపై, అది ఎవరికి వేయాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్‌ అందరికీ అవసరం లేదని ఇప్పటికే భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అసలు వ్యాక్సిన్‌ ఎవరు వేసుకోవాలి.. ఎవరు వేసుకోకూడదు.. దాని పనితీరు తదితర అంశాలపై నిమ్స్‌ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) విభాగం అధిపతి, శాస్త్రవేత్త డాక్టర్‌ మధుమోహన్‌రావు ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..    

వ్యాక్సిన్ల రక్షణ ఎన్నాళ్లు? 
అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ తమ వ్యాక్సిన్‌ పనితీరు 3 నెలలేనని ‘న్యూ ఇంగ్లండ్‌ జనరల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’అనే జర్నల్‌లో ప్రకటించింది. 190 మందిపై పరీక్షిస్తే మూడు నెలలే యాంటీబాడీలు ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత యాంటీబాడీలు పడిపోయాయి. ఇతర కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ల పనితీరు ఎంతకాలం అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. కాబట్టి వ్యాక్సిన్‌పైనే పూర్తిగా ఆధారపడలేం. ఒకవేళ ఎక్కువ కాలం రక్షణ కావాలంటే ఎక్కువ డోసులు తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల దుష్ఫలితాలు వస్తాయన్న అనుమానాలూ ఉన్నాయి. వ్యాక్సిన్ల సామర్థ్యంపైనే అందరికీ అనుమానాలు ఉన్నాయి. కంపెనీలు చెబుతున్నట్లుగా 90 శాతం పనిచేస్తున్నాయన్న దానిపై స్పష్టత లేదు. ర్యాండమ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ జరగట్లేదు. కంపెనీలు వ్యాక్సిన్ల భద్రతపై దృష్టి పెడుతున్నాయే కానీ, సామర్థ్యంపై దృష్టి పెట్టట్లేదు.  

అందరికీ ఒకేలా పనిచేయవు.. 
వ్యాక్సిన్‌ అందరికీ ఒకేలా పని చేయదు. మన శరీరంలోకి ప్రవేశించే వైరస్‌ ఒకటే కానీ, మన శరీరం స్పందించే తీరు వేర్వేరుగా ఉంటుంది. మన డీఎన్‌ఏలో ఉండే వ్యత్యాసాలే ఇందుకు కారణం. ప్రతి మనిషిలో ఒక్కో రకమైన జన్యుపదార్థం ఉంటుంది. వైరస్‌ మన జన్యు పదార్థంతో ఇంటరాక్ట్‌ అయ్యే విధానాన్ని బట్టి వ్యాక్సిన్‌ సామర్థ్యం ఉంటుంది. శరీరంలో కొన్ని జన్యువులు రోగ నిరోధక శక్తిని నిర్ధారిస్తాయి. వాటిలో ముఖ్యంగా హెచ్‌ఎల్‌ఏ (హ్యూమన్‌ ల్యూకోసైట్‌ యాంటిజెన్‌) జన్యువులు వైరస్‌తో అతుక్కునే విధానమే వ్యత్యాసాలకు కారణం. ఇదే టీకా సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది. భారతీయుల హెచ్‌ఎల్‌ఏ సమాచారం ఉంటే.. వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని ముందే అంచనా వేయొచ్చు. హెచ్‌ఎల్‌ఏ జీన్స్‌ను దేశంలో ర్యాండమ్‌గా సేకరించి సీక్వెన్సింగ్‌ చేయడం వల్ల మన వాళ్లలో ఏది ఎక్కువ రిస్క్, ఏది తక్కువ రిస్క్‌ కలిగిన జీన్స్‌ అనేది అంచనా వేయవచ్చు. దాన్ని బట్టి ఎవరికి వ్యాక్సిన్‌ అవసరమో లేదో తేల్చొచ్చు. 

వ్యాక్సిన్‌ అందరికీ అవసరం లేదా? 
వ్యాక్సిన్లు అందరికీ అవసరం ఉండదు. ఒక్కొక్కరి రోగనిరోధక శక్తి ఒక్కోరకంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికే వ్యాక్సిన్లు అవసరం. స్టెరాయిడ్స్‌ వాడుతున్న వారు, ఇతర మందులు వాడుతున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వయసు పైబడిన వారు, పోషకాహార లోపం ఉన్న వారిలో రిస్క్‌ ఎక్కువ. కొన్ని సందర్భాల్లో పెద్ద వయసు వారికంటే తక్కువ వయసు వారు కరోనాతో మరణించారు. దీనికి హెచ్‌ఎల్‌ఏ జీన్స్‌ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అయినా ఐసీఎంఆర్‌ కూడా అందరికీ వ్యాక్సిన్‌ అవసరం లేదని తేల్చి చెప్పింది. 

వారికి వ్యాక్సిన్‌ అవసరమే లేదు.. 
కరోనా వచ్చిన వారికి వ్యాక్సిన్‌ అవసరం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాళ్ల శరీరం అప్పటికే వైరస్‌పై పోరాటం చేసింది. వారిలో యాంటీబాడీలు లేకపోయినా మెమరీ టీ–సెల్స్‌ ఉంటాయి. అవి ఉండటం వల్ల రీ ఇన్ఫెక్షన్‌ వచ్చే చాన్స్‌ చాలా తక్కువ. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికే రీ ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరు తమలో యాంటీబాడీలు ఉత్పత్తి కాలేదని భయపడతున్నారు. కానీ టీ సెల్స్‌ ఉన్న సంగతి గుర్తించాలి. అవి చాలా పవర్‌ఫుల్‌. ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. టీ–సెల్స్‌ రెస్పాన్స్‌ను టెస్ట్‌ చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు భయపడుతున్నారు. రికవరీ అయిన వారికి ప్రత్యేక పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ వేయాల్సి వస్తే యాంటిబాడీ చెకప్‌ అవసరం.

ఒకవేళ ఎక్కువ యాంటీబాడీస్‌ ఉంటే వ్యాక్సిన్‌ వద్దే వద్దు. పెద్ద జబ్బులతో బాధపడుతూ, స్టెరాయిడ్స్‌ వాడేవాళ్లు ఒకసారి వైరస్‌ బారినపడినా, వైద్యుల సలహా మేరకు వ్యాక్సిన్‌ తీసుకుంటే కొంత ఉపశమనం ఉండొచ్చు. పైగా వైరస్‌ వచ్చి తగ్గిన వారు కరోనా వ్యాక్సిన్‌ వేసుకుంటే కొన్నిసార్లు సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉంది. యాంటీబాడీ డిపెండెంట్‌ సెల్యులార్‌ సైటోటాక్సిసిటీ (ఏడీసీసీ) వచ్చే ప్రమాదం ఉంది. ఏడీసీసీల వల్ల మన కణాలు మన శరీరంపైనే దాడి చేస్తాయి. ఫలితంగా ఎక్కువ యాంటీబాడీలు ఉత్పత్తి అయి కణాలు విచ్ఛిన్నం అవుతాయి. అలాగే కరోనా సోకి నయం అయిన వారిపై వ్యాక్సిన్‌ ప్రభావంపై పరిశోధనలు కూడా చాలా తక్కువగా జరిగాయి. కాగా, 17 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్‌ అవసరమే లేదు. వాళ్లలో వైరస్‌ ప్రవేశించే మార్గాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వారిలో వైరస్‌ లోడ్‌ తక్కువగా ఉంటుంది. వాళ్లల్లో ఇతరత్రా అనారోగ్య సమస్యలున్న వారు, స్టెరాయిడ్స్‌ వాడే వారికి మాత్రం వ్యాక్సిన్‌ అవసరం ఉండొచ్చు. 

ఎవరికి ఇవ్వాలో గందరగోళం.. 
అనారోగ్య సమస్యలున్నవారు.. 55 ఏళ్లకు పైబడినవారు.. రోగనిరోధక శక్తి తక్కువున్న వారు.. ఫ్రంట్‌లైన్‌ కార్మికులు, వైద్యులు, ఇతర సిబ్బంది.. ఇప్పటివరకు కరోనా బారినపడని వారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వాలి. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు ఎవరు? లక్షణాలు లేకుండానే కరోనా బారినపడిన వారున్నారు. వారికి అవసరంలేదనుకుంటున్నాం. కానీ వారెవరో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వారిలో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదో.. మిలియన్‌ డాలర్‌ ప్రశ్న. అది తెలుసుకోవాలంటే రోగనిరోధక శక్తి సామర్థ్యం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే హెచ్‌ఎల్‌ఏ సీక్వెన్సింగ్‌ డేటా కావాలి. అది లేదు కాబట్టి ఇప్పుడంతా గందరగోళంగా ఉంది.

ఐజీజీ పరీక్షల యాంటీబాడీలను నమ్మొచ్చా?
చాలామంది ఐజీజీ యాంటీబాడీ పరీక్షలు చేయించుకుని తాము సురక్షితం అనుకుంటున్నారు. అది నిజం కాదు. న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీస్‌ స్థాయి పరీక్ష చేసుకుంటారో వారికే నిర్దిష్టమైన సమాచారం వస్తుంది. ఐజీజీ యాంటీబాడీలు ఏ వైరస్‌తోనైనా రావొచ్చు లేదా రాకపోవచ్చు. ఆ యాంటీబాడీలు కోవిడ్‌ సంబంధిత యాంటీబాడీలుగా గుర్తించలేం.  

ఏది నిజమైన వ్యాక్సిన్‌? 
టీకాల్లో లైవ్‌ అటెన్యుయేటెడ్, ఇనాక్టివేటెడ్‌ వ్యాక్సిన్లు చాలా సమర్థమైనవి. లైవ్‌ అటెన్యుయేటెడ్‌ వ్యాక్సిన్‌ను కోడ్‌ డీ ఆప్టిమైజేషన్‌ టెక్నాలజీతో లైవ్‌ వైరస్‌ ద్వారా తయారు చేస్తారు. ఇది దీర్ఘకాలం పనిచేస్తుంది. ఇది చాలాకాలం రోగనిరోధక శక్తిని ఇస్తుంది. మిగతా పద్ధతిలో తయారు చేసే వ్యాక్సిన్ల పనికాలం తక్కువ ఉంటుంది. కొన్ని కంపెనీలు డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. అవి మన డీఎన్‌ఏలోకి చొచ్చుకుపోతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమే గాక, జెనెటిక్‌ మార్పులు వస్తాయి. వైరల్‌ వెక్టార్‌ ఆధారిత వ్యాక్సిన్లు దీర్ఘకాలికంగా మన శరీరంలోని డీఎన్‌ఏతో అనుసంధానం అయితే కొన్ని దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే వైరస్‌ కన్నా కూడా డ్రగ్స్‌పై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఇంకా ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top