బంజారాహిల్స్‌: తూలుతూ.. తేలుతూ.. యువతి రచ్చ..

New Year Eve: Youngsters Hulchal At Drunk And drive Test In Banjara Hills - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: మోతాదుకు మించి మద్యం సేవించి తూలుతూ.. వాహనాలు నడపడమే కాకుండా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు నిర్వహించేందుకు యత్నించిన ట్రాఫిక్‌ పోలీసుల విధులను అడ్డుకున్నారు. కొన్నిచోట్ల రచ్చరచ్చ చేయగా.. మరికొన్ని చోట్ల మద్యం మత్తులో మహిళలు పోలీసులను కూడా ఖాతరు చేయకుండా నెట్టిపడేశారు. బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్టడీ సర్కిల్‌ వద్ద పికెట్‌ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇక్కడ 30 కేసులు నమోదు చేశారు. గ్రీన్‌ బావర్చి వద్ద తనిఖీల్లో 12 మంది మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు.

శుక్రవారం నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పరిధిలోని  క్లబ్‌లు, పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, కెఫేలు, రిసార్ట్‌లలో మద్యం సేవించి అర్ధరాత్రి 12 దాటిన తర్వాత రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు శ్వాస పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఓ యువతి పోలీసుల విధులను అడ్డుకుంది. బ్రీత్‌ ఎనలైజర్‌కు ససేమీరా అంది. అయితే ఆమెతో పాటు స్నేహితుడు శ్వాసపరీక్షలకు ముందుకు రాలేదు. పోలీసులపైకి దూసుకెళుతూ అడ్డు వచ్చిన వారిని నెట్టేసింది. అరగంటపాటు రచ్చరచ్చ చేసింది. పోలీసులు వారిద్దరిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు.

జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డైమండ్‌ హౌజ్, చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్, రోడ్‌ నం. 45, బీవీబీపీ జంక్షన్లలో నాలుగు చోట్ల రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. మద్యం మత్తులో వాహనదారులు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. తీవ్ర వాగ్వాదం జరిగింది. నెట్టుకోవడాలు, ఒకరిపై ఒకరు చేయి చేసుకునేదాకా పరిస్థితి అదుపు తప్పింది. ఇక్కడ 50 మందిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.ముత్తు నమోదు చేశారు. 

చదవండి: దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌..నుమాయిష్‌ ఐడియా ఎలా వచ్చిందంటే.. 

51 మందిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల నమోదు 
హిమాయత్‌నగర్‌: పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే సమయంలో మందుబాబులు హల్‌చల్‌ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే భారీ జరిమానాలు, జైలు శిక్ష అంటూ పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేసినా మందుబాబుల్లో కనీస స్పందన, భయం లేకపోవడం గమనార్హం. నారాయణగూడ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇన్‌స్పెక్టర్‌ చంద్రమౌళి, ఎస్‌ఐ మల్లయ్యలు రెండు టీంలుగా ఏర్పడి లిబర్టీ చౌరస్తా, హిమాయత్‌నగర్‌ వై జంక్షన్, ఎక్స్‌ రోడ్స్, వైఎంసీల వద్ద డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు.
చదవండి: కేకలు, అరుపులు.. జూబ్లీహిల్స్‌లో యువతి హల్‌చల్‌

శుక్రవారం రాత్రి 11 నుంచి శనివారం తెల్లవారుజాము 3 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. ఇందులో 51 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. కొందరు కారు, ద్విచక్ర వాహనాలపై ఫుల్లుగా తాగి డ్రైవ్‌ చేయడం గమనార్హం. రోడ్లపై న్యూ ఇయర్‌ విషెస్‌ చెబుతూ ద్విచక్ర వాహనాలపై త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తున్న వారు సైతం పోలీసులకు పట్టుబడ్డారు. 35 మందిపై త్రిబుల్‌ రైడింగ్‌ కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ చంద్రమౌళి వివరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top