
చేవెళ్ల హైవే విస్తరణకుకొత్త డిజైన్
915 మర్రి వృక్షాలనుకాపాడేందుకు మధ్యేమార్గం
హరిత ట్రిబ్యునల్‌కు డిజైన్ సమర్పించిన ఎన్‌హెచ్‌ఏఐ
సెంట్రల్ మీడియన్ స్థలాన్నికుదించి చెట్లను కాపాడే యత్నం
సాక్షి, హైదరాబాద్: హెదరాబాద్ – బీజా పూర్ జాతీయ రహదారిలో భాగంగా హైదరాబాద్ శివారులోని అప్పా కూడలి నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ 916 మర్రి వృక్షాలను తొలగించాల్సి రావటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పర్యావరణ ప్రేమి కులు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించటంతో రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
మర్రి వృక్షాల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక సమ ర్పించాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించిన నేపథ్యంలో తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ సరికొత్త ఆలోచనతో మధ్యేమార్గాన్ని రూపొందించింది. గతంలో రూపొందించిన డిజైన్‌ను సవరించి రూపొందించిన కొత్త డిజైన్‌ను తాజాగా ట్రిబ్యునల్‌కు ఎన్‌హెచ్‌ఏఐ సమర్పించింది. మరోవైపు కేసు దాఖలు చేసిన పర్యావరణ ప్రేమికులు, ఆ డిజైన్ ప్రకారం వృక్షాల భద్రతపై ఈ వారంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ట్రిబ్యునల్ ముందు తమ వాదనను వినిపించనున్నారు.
ఇదీ చిక్కు...
హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు ఉన్న 163 నంబర్ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఉన్న 46.405 కి.మీ. సర్వీసు రోడ్లతోపాటు నాలుగు వరసలుగా విస్తరించే బాధ్యతను ఎన్‌హెచ్‌ఏఐకి కేంద్ర ఉపరితల రవాణాశాఖ అప్పగించింది. మన్నెగూడ నుంచి పరిగి మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు ఉన్న భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని ఎన్‌హెచ్ విభాగానికి అప్పగించింది.
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డుకిరువైపులా 60 నుంచి 85 ఏళ్ల వయసు ఉన్న 915 మర్రి వృక్షాలను తొలగించాల్సి రావటంతో పర్యావరణ ప్రేమికులు అభ్యంతరం తెలిపారు. ఆ రోడ్డును అలాగే ఉంచి ప్రత్యామ్నాయ రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో కేసు దాఖలు చేశారు.
తాజా పరిష్కారం ఇలా: రోడ్డును రెండు వైపులా కలిపి 60 మీటర్లకు విస్తరించాల్సి ఉంది. దీంతో అక్కడ ఉన్న అన్ని మర్రి వృక్షాలను తొలగించాలని గతంలో నిర్ణయించారు. ఇప్పుడు ఆ డిజైన్‌ను మార్చారు. తొలుత 5 మీటర్లుగా ప్రతిపాదించిన సెంట్రల్ మీడియన్‌ను ఇప్పుడు 1.5 మీటర్లకు తగ్గించారు. దీంతో కలిసి వచ్చే మూడున్నర మీటర్ల భాగాన్ని ప్రధాన కారేజ్‌వేలో కలిపేయటం ద్వారా వృక్షాలకు చేరువ వరకు మాత్రమే రోడ్డును విస్తరిస్తారు. వృక్షాల ఆవల సర్వీసు రోడ్డును నిర్మిస్తారు.
అంటే.. సర్వీసు రోడ్డుకు, ప్రధాన క్యారేజ్ వేకు మధ్యలో ఆ వృక్షాలుంటాయి. రోడ్డు మీదకు వచ్చి వాహనాలకు ఇబ్బందిగా మారే కొమ్మలను తొలగిస్తారు. 150 వృక్షాలు మాత్రం ఈ డిజైన్‌కు అనుకూలంగా లేవు. దీంతో వాటిని ఉన్న చోట నుంచి ట్రాన్స్‌లొకేట్ పద్ధతిలో కాస్త పక్కకు మార్చి తిరిగి నాటుతారు. ఆ 150 వృక్షాలకు ఇప్పటికే రెడ్ మార్క్ వేశారు. అయితే, ఈ డిజైన్ ప్రకారం మర్రి వృక్షాల కొమ్మలు తొలగించనుండటంతో పర్యావరణ ప్రేమి కులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.