తారకరత్నకు కన్నీటి వీడ్కోలు 

Nandamuri Tarakaratna Funeral In Hyderabad - Sakshi

మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు 

రాయదుర్గం, బంజారాహిల్స్‌: సినీనటుడు నందమూరి తారకరత్నకు కన్నీటి వీడ్కోలు పలికారు. రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో అంత్యక్రియలను సోమవారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు. అంతకుముందు ఫిలించాంబర్‌ నుంచి మహాప్రస్థానం వరకు ప్రత్యేక వాహనంలో తారకరత్న భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. పెద్ద సంఖ్యలో కుటుంబసభ్యులు, సినీప్రముఖులు, రాజకీయ నాయకులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.

మహాప్రస్థానానికి చేరుకున్న తర్వాత పాడెపైకి తారకరత్న పార్ధివదేహాన్ని చేర్చగానే సినీ హీరో బాలకృష్ణ ఆయన సోదరుడు రామకృష్ణతోపాటు బంధువులు, సన్నిహితులు పాడెమోస్తూ చితి వద్దకు తీసుకొచ్చారు. చితికి తండ్రి మోహనకృష్ణ నిప్పు అంటించారు. ఈ సమయంలో తారకరత్న అమర్‌రహే నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎంపీ విజయసాయిరెడ్డి, సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నారాలోకేశ్, మాగంటిబాబు, జవహర్, నారాయణ, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితోపాటు నందమూరి కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు పాల్గొన్నారు. 

ఫిలిం చాంబర్‌లో నివాళులు 
తొలుత అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఉదయం 9 గంటలకు తారకరత్న భౌతికకాయాన్ని ఫిలించాంబర్‌కు తీసుకొచ్చి సాయంత్రం 3 గంటల వరకు ఇక్కడే ఉంచారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సినీనటులు దగ్గుబాటి వెంకటేష్, తరుణ్, అశోక్‌ కుమార్, శివాజీ, కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి, కేఏ పాల్‌ తదితరులు తారకరత్న భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top