నల్లగొండ: అమెరికాలో ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్‌రెడ్డి–శోభ దంపతుల పెద్ద కుమార్తె నవ్య(24) మృతదేహం ఆరు రోజుల తర్వాత శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వగ్రామానికి చేరుకుంది. నవ్య బీటెక్ పూర్తిచేసి ఎంఎస్ చేసేందుకు రెండున్నరేళ్ల క్రితం అమెరికాకు వెళ్లింది. అక్కడ చికాగో రాష్ట్రంలోని రోజ్‌వెల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది.

ఈ నెల 16న రాత్రి కారులో వెళ్తుండగా.. వెనుక నుంచి మరో కారు వచ్చి ఢీకొట్టడంతో నవ్య అక్కడికక్కడే మృతిచెందింది. కాగా.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమార్తె విగతజీవిగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. నవ్య మృతదేహానికి ఆమె తల్లి శోభ బొట్టు పెట్టి సొమ్మసిల్లి పడిపోయింది. ‘నీకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపియ్యాలనుకున్న బిడ్డా.. కానీ నీకు తలకొరివి పెట్టే కర్మ పట్టింది.. ఏ తండ్రికి నాలాంటి బాధ రావొద్దు బిడ్డా..’ అంటూ నవ్య తండ్రి గడుసు శ్రీనివాస్‌రెడ్డి రోదించిన తీరు గ్రామస్తులు, బంధువులను కంటతడి పెట్టించింది.
అనంతరం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తిచేశారు. నవ్య భౌతికకాయానికి ఆమె తండ్రి తలకొరివి పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. అంతిమయాత్రలో స్థానిక సర్పంచ్ నేతగాని కృష్ణ, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, చెరువుగట్టు ఆలయ చైర్మన్ వరాల రమేష్, మాజీ సర్పంచ్ మల్గా బాలకృష్ణ, నవీన్‌రెడ్డి, పున్నం రాజు యాదగిరి అంతిమయాత్రలో పాల్గొని నివాళులరి్పంచారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారంతో ఆరు రోజుల్లోనే నవ్య మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో ఆయనకు నవ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


