
బడ్జెట్‌లో రూ.48 కోట్ల కేటాయింపు: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: ‘నేతన్నకు భరోసా’ పథకానికి ఈ నెల 2న మార్గదర్శకాలను జారీ చేసినట్లు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ఇందుకోసం రూ.48 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో భాగంగా.. జియో ట్యాగ్ చేసిన మగ్గాలపై పనిచేస్తున్న వారికి వేతన ప్రోత్సాహకం కింద.. గరిష్టంగా ఏటా నేత కార్మికులకు రూ.18,000, అనుబంధ కార్మికులకు రూ.6,000 అందించనున్నట్లు తెలిపారు. ఇందువల్ల దాదాపు 40,000 మంది చేనేత, అనుబంధ కార్మికులు లబ్ధి పొందుతారని వివరించారు.
చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు ప్రత్యేకంగా రూపొందించిన యూనిక్ లోగోను జత చేయనున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండి జియో ట్యాగ్ చేసిన మరమగ్గాలపై పనిచేసే కార్మికులు, ప్రీలూమ్, ప్రిపరేటరీ పనులైన.. డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్ తదితర అనుబంధ పనులు చేసే కార్మికులు, వార్షికాదాయంలో చేనేత వృత్తి ద్వారా కనీసం 50 శాతం ఆర్జిస్తున్న వారు అర్హులని పేర్కొన్నారు.
ఈ పథకం కింద జియో ట్యాగ్ చేసిన మగ్గాల ద్వారా కనీసం 50 శాతం కంటే ఎక్కువ వార్పులు పూర్తి చేసిన వారికి నేరుగా వేతన ప్రోత్సాహకం కింద.. ఏటా రెండు విడతలుగా (ఏప్రిల్ నుండి సెప్టెంబర్, అక్టోబర్ నుండి మార్చి) బ్యాంకు ఖాతాలోకి నేత కార్మికునికి రూ.9,000, అనుబంధ కార్మికునికి రూ.3,000 జమ చేయనున్నట్లు వివరించారు. కాగా, మొదటి విడతలో 50 శాతం వార్పులు పూర్తి చేయని వారు, రెండో విడతలో పూర్తి చేసినట్లయితే మొత్తం ప్రోత్సాహకాన్ని.. సంవత్సరాంతంలో చేనేత, అనుబంధ కార్మికులకు అందించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.