రసాభాసగా ‘మూసీ’పై అభిప్రాయ సేకరణ | Musi Victims argument with officers | Sakshi
Sakshi News home page

రసాభాసగా ‘మూసీ’పై అభిప్రాయ సేకరణ

Apr 7 2026 4:44 AM | Updated on Apr 7 2026 4:44 AM

Musi Victims argument with officers

పన్నులు కడుతున్నాం...అక్రమ కట్టడాలుగా ఎలా చిత్రీకరిస్తారు?

ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు...కానీ ఇళ్లు ఇచ్చే ప్రసక్తే లేదు 

అధికారులతో బాధితుల వాగ్వాదం...అడ్డుకున్న పోలీసులు

బండ్లగూడ: రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ సేకరణ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు, గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు అభివృద్ధి నిమిత్తం భూ సేకరణ చట్టం సెక్షన్‌ 11(2) అనుసరించి కిస్మత్‌పూర్‌లోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌ కార్యాలయంలో పోలీసుల బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ సోమవారం జరిగింది. ఈ సభ గొడవకు దారి తీయగా, భూ బాధితులు, మధుపార్క్‌ అపార్ట్‌మెంట్‌వాసులు అధికారులను నిలదీశారు. 

రాజేంద్రనగర్‌ ఆర్డీవో వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మధు అపార్ట్‌మెంట్‌ ప్రాంతాలకు చెందిన బాధి తులు, హిమాయత్‌సాగర్, కిస్మత్‌పూర్, గంధంగూడ తదితర ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రాజెక్టు అసలు లక్ష్యం ఏంటనే దానిపై అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదని, ఇది కేవలం గాంధీ సరోవర్‌ కోసమా? లేక మూసీ బ్యూటిఫికేషన్‌ కోసమా? అన్నది స్పష్టం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కష్టపడి సంపా దించుకున్న ఇళ్లను ఎందుకు ఇవ్వాలి? బఫర్‌ జోన్, ఎఫ్‌టీఎల్‌ అని ఏ ప్రాతిపదికన నిర్ధారించారు? అని అధికారులను నిలదీశారు. 

బాధితుల ప్రధాన ప్రశ్నలు...: పన్నుల చెల్లింపు క్రమం తప్పకుండా ప్రాపర్టీ టాక్స్, ఇతర పన్నులు కడుతున్నప్పుడు తమ ఇళ్లను అక్రమ కట్టడాలుగా ఎలా చిత్రీకరిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా ఆఫీసులకు సెలవులు పెట్టి ఈ అభిప్రాయ సేకరణకు రావాలా? సరైన ప్రణాళిక లేకుండా మమ్మల్ని పిలవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు కలిగే ఉపయోగం ఏమిటో చెప్పకుండా, అడ్డగోలుగా భూములు, ఇళ్లు ఎలా తీసుకుంటారని నిలదీశారు. 

బాధితులంతా ఒక్కసారిగా ఆర్టీవో వద్దకు దూసుకెళ్లి నిరసన తెలపడంతో కార్యాలయంలో తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో అక్కడే మోహరించిన పోలీసు బలగాలు బాధితులను అడ్డుకున్నాయి. తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఇళ్లు ఇచ్చే ప్రసక్తే లేదని గాంధీ సరోవర్‌ ప్రాంత బాధితులు కుండబద్దలు కొట్టినట్లు అధికారులకు తేల్చిచెప్పారు. బాధితులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభలో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట్‌రెడ్డి, గండిపేట మండల ఎమ్మార్వో శ్రీనివాస్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు, భూ బాధితులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement