పారదర్శకత.. ఉత్తమ పనితనం | Motukupalli Gram Panchayats Win National Awards: Telangana | Sakshi
Sakshi News home page

పారదర్శకత.. ఉత్తమ పనితనం

May 11 2026 1:48 AM | Updated on May 11 2026 1:48 AM

Motukupalli Gram Panchayats Win National Awards: Telangana

గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్‌

మోత్కుపల్లికి జాతీయ అవార్డు 

ఆన్‌లైన్‌లో రికార్డుల నిర్వహణ, పాలనలో ప్రజల భాగస్వామ్యం.. 

ఫలితంగా సుపరిపాలనలో దక్కిన కేంద్ర పురస్కారం

వికారాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లి మండల పరిధిలోని మో త్కుపల్లి గ్రామ పంచాయతీ సుపరిపాలనలో జాతీయ పురస్కారానికి ఎంపికయింది. రికార్డులు పూర్తి స్థాయి లో ఆన్‌లైన్‌లో నిర్వహించటం, నిధుల ఖర్చులో పారదర్శకత, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడటం, తరచూ సమావేశాల ద్వారా గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను పాలనలో భాగస్వాములను చేయటం, రికార్డుల్లో నమోదైన అంశాలు వాస్తవంలోనూ ప్రతిబింబించటంలాంటి అంశాలు ఈ గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక కావటంలో కీలక భూమిక వహించాయి. ఈ గ్రామంలో 703 కుటుంబాలు, 2,090 ఓటర్లు, 2,576 మంది జనాభా ఉన్నారు.  

అవార్డు వరకు తీసుకువెళ్లిన అంశాలివే.. 
మోత్కుపల్లి గ్రామంలో జరిగిన ప్రగతి, గ్రామంలో తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసే పద్ధతి, పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్మాణం, వాటిని వాడటం, మురుగు గుంతలు లేకుండా గ్రామంలో చేపడుతున్న చర్యలు, రోడ్ల పరిశుభ్రత, మురుగు కాల్వల పరిశుభ్రత, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ, గ్రామంలో నిర్వహించిన హరితహారం.. అందులో బతికి ఉన్న మొక్కల శాతం, ఇంకుడు గుంతలు, విద్యా, వైద్యం, పౌష్టికాహారం, ఇమ్యునైజేషన్‌ తదితర అంశాలు కేంద్ర ప్రభుత్వ అధికారులను ఆకర్షించాయి.

వీటితో పాటు గ్రామంలో అక్షరాస్యత పెంచేందుకు చేపడుతున్న కార్యక్రమాలను సైతం పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే గ్రామంలో ఖర్చు చేసిన నిధులు, పన్నుల వసూలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, వారికందిస్తున్న పౌష్టికాహారం, ఉపాధి హామీలో వందరోజులు పని చేసిన కుటుంబాలు, లబ్ధి పొందిన కుటుంబాలు.. వీటన్నింటిని ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్ర ఉన్నతాధికారులు గ్రామాన్ని జాతీయ అవార్డు కోసం ఎంపిక చేశారు.  

మాపై బాధ్యత మరింత పెరిగింది 
మా గ్రామానికి జాతీయ స్థాయి అవార్డు రావటం సంతోషంగా ఉంది. దీంతో మాపై బాధ్యత మరింత పెరిగింది. గ్రామ అభివృద్ధిలో అధికారులు, ఉద్యోగులు, జీపీ సభ్యులు, ప్రజలు.. ఇలా అందరి సహకారం ఉంది. అవార్డు రావటంలో గత సర్పంచ్, వార్డు సభ్యుల కృషి కూడా ఎంతో ఉంది. అవార్డు ద్వారా వచ్చే నిధులతో గ్రామాన్ని మరింత అభివృద్ది చేస్తాం.   – అమృతమ్మ, సర్పంచ్, మోత్కుపల్లి 

Advertisement
 
Advertisement
Advertisement