
సాక్షి,హైదరాబాద్: తాను పార్టీకి రాజీనామా చేయడంలో ఎలాంటి కుట్ర లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి బీజేపీలో చేరనున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారాన్ని ఖండించారు. తాను బీజేపీలో చేరడం లేదని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు హాట్ కామెంట్స్ చేశారు.
‘‘రామచందర్ రావు మంచి రైటర్. కానీ తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలంటే మంచి ఫైటర్ కావాలి. నా రాజీనామా వెనక కుట్ర లేదు. వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారికి అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయంపై కేంద్ర పార్టీకి చెప్పాలని అనుకుంటున్నా.
నా రాజీనామాను కేంద్ర పార్టీ ఆమోదించడం వెనక కుట్ర జరిగింది. నా పార్టీలో చేరడానికి నేను ప్రయత్నం చేయడం లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎం చేయాలో కేంద్ర పార్టీకి వివరించాలని ఉంది.
హోంశాఖ మంత్రి అమిత్ షా నాకు ఫోన్ చేయలేదు. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న తప్పిదాలపై కేంద్రానికి లేఖ రాశా.. మెయిల్స్ చేశాను. వారి దృష్టికి వెళ్ళిందో లేదో.. తెలియదు. బేగంపేట ఎయిర్‌పోర్టులో కలిసినప్పుడు అమిత్ షాకు కలుస్తానని చెప్పాను.. ఆ లోపే రాజీనామా చేశాను.
తెలంగాణలో 2014, 2018, 2023 ఎన్నికల్లో బీజేపీకి ఎవరు మోసం చేశారో, ఎవరు వెనక నుంచి కత్తిపోట్లు పొడిచారో ఐబీ రిపోర్ట్ కేంద్ర పార్టీ తెప్పించుకోవాలి. కొంతమంది బీజేపీ మహిళానేతలకు దండం. వారికి సన్మానం చేస్తా. నా ఉద్దేశ్యం ఒక్కటే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడమే. నాకు అమిత్ షా ఫోన్ చేశారని యూట్యూబ్ ఛానళ్లలో ఫేక్ వార్తలు పెట్టించి రాజీనామా ఆమోదించేలా చేశారు. ఫేక్ వార్తలు, మీడియాలో లీకులు ఇచ్చే అలవాటు నాకు లేదు.. అటువంటి చిన్న ఆలోచన నేను చేయను"అని అన్నారు.