
సాక్షి, హైదరాబాద్: నేడు నగరంంలో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ వేడుక షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. యుద్ధం వాతావరణం నేపథ్యంలో ఈవెంట్ వాయిదా వేయాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తుండగా.. అనుకున్న షెడ్యూల్‌కి జరిపి తీరుతామని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే ఐపీఎల్ లాంటి ఈవెంట్‌ను బీసీసీఐ వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.
22 రోజుల పాటు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్.. తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు అతిథ్యమిస్తోంది. పోటీల్లో 120 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటారని భావించగా, ఇప్పటివరకు 111 మంది నగరానికి చేరుకున్నారు.
అందాల పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. పాకిస్తాన్‌తో యుద్ధం కొనసాగుతున్నా, పోటీ దారులు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పొల్గొనేందుకు నగరానికి చేరుకోవటం విశేషం. పదో తేదీతో ప్రారంభమయ్యే పోటీలు ఈనెల 31 వరకు కొనసాగనున్నాయి. 1న హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలే జరుగుతుంది.
మొదటి 3, 4 స్థానాల్లో నిలిచిన సుందరీమణులు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొంటారు. పరేడ్ మైదానంలో జరిగే వేడుకల్లో కూడా పాల్గొంటారా, లేదా.. సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆధ్వర్యంలో జరిగే ఎట్‌హోమ్ వరకే పరిమితమవుతారా అన్నది తేలాల్సి ఉంది. మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ (2024) ఫైనల్ పోటీలు ముంబైలో జరిగాయి. వరుసగా రెండోసారి పోటీలు ఇండియాలోనే జరుగుతుండటం విశేషం.
రాష్ట్ర గీతం ఆలాపనతో వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రముఖ గాయకుడు, శిక్షకుడు కొమాండూరి రామాచారి శిష్య బృందం 50 మంది బృంద గీతంగా దీన్ని ప్రత్యక్షంగా ఆలపిస్తారు. అనంతరం కాకతీయుల కాలంలో రూపొందిందిన సంప్రదాయ నృత్యరీతి పేరిణి నాట్య ప్రదర్శన ఉంటుంది. 250 మంది మహిళా కళాకారిణులు పేరిణి లాస్య సంప్రదాయాన్ని అనుసరించి ఈ నృత్యాన్ని ప్రదర్శించబోతున్నారు. దీనికి పేరిణి సందీప్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఫణి నారాయణ స్వరాలు సమకూర్చనున్నారు. పది నిమిషాల పాటు ఈ నృత్య కార్యక్రమం కొనసాగనుంది. కళాకారులు అందరూ కలిసి తమ విన్యాసాలలో భాగంగా నక్షత్రం, సీతాకోకచిలుక, మిస్ వరల్డ్ లోగో ఆకృతులను ప్రదర్శిస్తారు.
ప్రపంచ దేశాల నుంచి విచ్చేసిన సుందరీమణుల పరిచయ కార్యక్రమం ఖండాల వారీగా నిర్వహిస్తారు. ఆ సమయంలో తెలంగాణ జానపద, గిరిజన కళారూపాల ప్రదర్శనలు ఉంటాయి. తొలుత భద్రాచలం గోదావరి పరీవాహక ప్రాంతానికి పట్టుగొమ్మగా నిలిచిన కొమ్ము కోయ కళాకారులు రామకృష్ణ బృందం ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత కత్లే శ్రీధర్ బృందం నేతృత్వంలో ఆదిలాబాద్ గోండు జాతి ప్రజల విశిష్ట కళారూపం గుస్సాడీ కళా ప్రదర్శన ఉంటుంది.
అప్పుడు మరొక ఖండానికి సంబంధించిన సుందరీమణులు వేదిక పైకి వస్తారు. తెలంగాణ జానపద సంప్రదాయానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచే డప్పు వాయిద్య కార్యక్రమాన్ని ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత అందె భాస్కర్ బృందం, తెలంగాణ గిరిజన వైభవానికి ప్రతీకగా నిలిచే బంజారా మహిళల విన్యాసాలను స్వప్న బృందం ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కూడా పోటీదారులను పరిచయం చేస్తారు. ఆ తర్వాత తెలంగాణ గ్రామీణ పల్లె జీవన ప్రతీకగా నిలిచిన ఒగ్గుడోలు కళా విన్యాసాలు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత చౌదరపల్లి రవి కుమార్ బృందం ఆధ్వర్యంలో ప్రదర్శిస్తారు. ఈ కళారూపాల అన్నింటి మేళవింపుతో ముగింపు ఉంటుంది.
ఈనెల మూడో తేదీ మొదలు నిత్యం సుందరీమ ణులు నగరానికి వస్తూనే ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ తిలకం దిద్ది, హారతి ఇస్తూ, కూచిపూడి, భరతనాట్యం, పేరిణి, కథక్ నృత్యరీతులు ప్రదర్శిస్తూ.. డప్పు వాయిద్యాలు, బాజాభజంత్రీలు, మంగళ వాయిద్యాలతో కూడిన బృందాలతో స్వాగతం పలుకుతున్నారు. ఈకార్యక్రమాలు 24 గంటల పాటు కొనసాగుతున్నాయి. దీనిని విదేశీ అతిథులు సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తుండటం గమనార్హం.