దళితబంధుపై సమగ్ర నివేదిక సమర్పించండి 

Minister Talasani Srinivas Yadav Review On Dalit Bandhu - Sakshi

నెలాఖరులోగా గ్రౌండింగ్‌ కాని యూనిట్ల పూర్తి 

దళిత బంధుపై మంత్రి తలసాని సమీక్ష 

సాక్షి, సిటీబ్యూరో:  దళిత బంధు యూనిట్ల  పనితీరుపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతగా దళిత బంధు కింద  లబ్ధి పొందిన వారి వివరాలు, యూనిట్‌ ప్రస్తుత పనితీరు, సాధించిన ఫలితాలు తదితర వివరాలతో ఫోటో, వీడియో గ్రఫీని సేకరించి నివేదిక రూపంలో ఈ నెల 20 వ తేదీ లోగా అందజేయాలని  సూచించారు.

గురువారం మాసాబ్‌ ట్యాంక్‌ లోని తన కార్యాలయంలో దళితబందు పథకం అమలు జరుగుతున్న  తీరుపై హోంమంత్రి మహమూద్‌ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన  దళిత బంధు కార్యక్రమం అమలులో ఎలాంటి విమర్శలకు, ఫిర్యాదులకు అవకాశం లేకుండా నిబంధనల ప్రకారం అమలు చేయాలని ఆదేశించారు.  

అర్హులైన దళితులందరికీ.. 
అర్హులైన దళితులందరికి  దశల వారిగా ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి వెల్లడించారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేసి  ఆర్ధిక సహాయం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు  

హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాలలో 1476 మంది దరఖాస్తు చేసుకోగా, 1462 మంది ఖాతాలలో 10 లక్షల రూపాయలు చొప్పున నిధులు జమ చేసినట్లు  మంత్రి  వివరించారు. వీరిలో 1200 మంది లబ్ధిదారులకు వారి యూనిట్‌ లను అందజేయడం జరిగిందని చెప్పారు.  

మొదటి విడతలో  మంజూరై గ్రౌండింగ్‌కానీ యూనిట్లను ఈ నెలాఖరులోగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ప్రభాకర్‌ రావు, స్టీఫెన్‌ సన్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సాయన్న, ముఠా గోపాల్, జాఫర్‌ హుస్సేన్, పాషా ఖాద్రి, కలెక్టర్‌ అమయ్‌ కుమార్, ఎస్‌సీ  కార్పోరేషన్‌ ఈడీ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top