తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం | Minister ktr invitation to Swedish companies | Sakshi
Sakshi News home page

తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం

May 4 2023 1:26 AM | Updated on May 4 2023 1:26 AM

Minister ktr invitation to Swedish companies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే స్వీడన్‌ కంపెనీలకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం అని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టే స్వీడన్‌ కంపెనీలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. భారత్‌లోని స్వీడన్‌ రాయబారి జాన్‌ తెస్లెఫ్‌ ఆధ్వర్యంలో ఆ దేశ వ్యాపార, వాణిజ్య ప్రతినిధులు, పలు కంపెనీల అధిపతులతో బుధవారం సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ సమావేశం అయ్యారు. రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ ఆలోచన విధానాన్ని తెలియజేశారు.

పెట్టుబడి అవకాశాల గురించి వివరించారు. టెక్నాలజీ, తయారీ రంగాల్లో స్వీడన్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న కంపెనీలను తెలంగాణకు కేటీఆర్‌ ఆహ్వానించారు. స్వీడన్‌ రాయబారితో కలిసి వచ్చిన ఆ దేశానికి చెందిన కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్‌లో తమ సంస్థల కార్యకలాపాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పారిశ్రామిక అనుకూల ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ఎనిమిదేళ్ల కాలంలో హైదరాబాద్‌ నగరం రూపురేఖలు సంపూర్ణంగా మార్చేలా తీసుకువచ్చిన మౌలిక వసతుల కల్పన విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

హైదరాబాద్‌ నగరంలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణం ఆధారంగా తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను రప్పించేందుకు ప్రయత్నం చేస్తానని స్వీడన్‌ రాయబారి జాన్‌ తెస్లెఫ్‌ హామీ ఇచ్చారు. భారత్‌లో పెట్టుబడులకు ముందుకొచ్చే కంపెనీల బృందంతో కలిసి పనిచేసేందుకు ఇన్వెస్ట్‌మెంట్‌ ఫెసిలిటేషన్‌ మెకానిజం పేరుతో తాము ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఇది స్వీడన్‌ వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు పలు కంపెనీలతోనూ కలిసి పని చేస్తుందన్నారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను తమ కార్యాలయం పరిశీలిస్తుందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement