వైల్డ్‌లైఫ్‌ ఎవిడెన్స్‌ కలెక్షన్‌ కిట్‌ ఆవిష్కరణ 

Minister Indrakaran Reddy Inauguration Of Wildlife Evidence Collection Kit - Sakshi

అటవీ అధికారులకు అందజేసిన మంత్రి ఇంద్రకరణ్‌   

సాక్షి, హైదరాబాద్‌: వన్యప్రాణుల సంరక్షణ, వాటి డేటాను భద్రపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం అరణ్యభవన్‌లో ‘వైల్డ్‌ లైఫ్‌ కన్జర్వేషన్‌ సొసైటీ’రూపొందించిన వైల్డ్‌లైఫ్‌ ఎవిడెన్స్‌ కలెక్షన్‌ కిట్‌ను మంత్రి ఆవిష్కరించారు. కిట్‌ పని తీరు, శాంపిల్స్‌ సేకరణ, వైల్డ్‌లైఫ్‌ డీఎన్‌ఏ పరీక్షల విశ్లేషణ తదితర అంశాలను సొసైటీ ప్రతినిధులు వివరించారు.

వన్యప్రాణుల వధ జరిగినపుడు నేర పరిశోధనలో భాగంగా ఆ ప్రాంతం నుంచి ఆధారాలను సేకరించడం, అవి సహజ మరణం పొందినప్పుడు వాటి పాదముద్రలు, గోళ్లు, వెంట్రుకలు, పెంట, మాంసాహార అవశేషాలను సేకరించి వాటి డీఎన్‌ఏ పరీక్షల విశ్లేషణ కోసం పంపుతామన్నారు. విచారణ సమయంలో న్యాయస్థానాలకు ఈ పరీక్షల రిపోర్టును సమర్పిస్తే, వాటి ఆధారంగా వేటగాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్పారు.

నేర పరిశోధనలో ఆధారాల సేకరణలో ఫోరెన్సిక్‌ విభాగం ఎంతో కీలకమైందన్నారు. బయోలాజికల్‌ ఎవిడెన్స్‌ ద్వారా వేట గాళ్ళకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుందన్నారు. ఉపయోగించే తీరుపై అటవీ అధికారులకు శిక్షణ ఇచ్చి కిట్లను అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top