నిరుపేదలకు త్వరలో శుభవార్త: మంత్రి హరీశ్‌రావు

Minister Harish Rao: Good News For Poor People In Soon - Sakshi

సొంత స్థలంలో ఇంటికి చేయూత

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు 

సాక్షి,సిద్దిపేట‌: తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు సీఎం కేసీఆర్‌ త్వరలో శుభవార్త ప్రకటించనున్నారని, సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి సర్కార్‌ చేయూతగా నిలువనుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో పది వేల కోట్ల రుపాయాలను కేటాయించిందని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని 8వ వార్డు హనుమాన్‌నగర్‌లో రూ. 15లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి ప్రారంభించారు.

స్థానిక 30 వ వార్డులో సీసీ రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మరో రెండు నెలల్లో ఇండ్ల నిర్మాణం ప్రారంభం చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాల మంజూరీలో ఇబ్బందులు ఎదరవ్వకుండా బడ్జెట్‌లో మూడు వేల కోట్లు కేటాయించామన్నారు.   

సెకండ్‌ వేవ్‌తో జాగ్రత్త.. 
ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ కరోనా వ్యాప్తి మరోసారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. స్వీయనియంత్రణలో మెదలాలని సూచించారు. ఏప్రిల్‌ నుంచి కేంద్రం 45 సంవత్సరాల వారికి కూడా టీకా ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చిందన్నారు. అనంతరం తన నివాస గృహాంలో నియోజకవర్గంలోని లబ్దిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సూడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి, కౌన్సిలర్‌లు వజీర్, నర్సయ్య పాల్గొన్నారు.  


మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు

మంత్రి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ 
పందిరి కూరగాయాల సాగు చేస్తున్న రైతులకు ఆదివారం సాయంత్రం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేశారు. నాబార్డు సహకారంతో సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇబ్రహీంపూర్, గుర్రాలగొంది, ఇర్కొడు, పెద్ద లింగారెడ్డిపల్లి, వెంకటాపూర్, విఠలాపూర్‌ గ్రామాలకు చెందిన రైతులకు రెండో విడత కింద ఒక్కొక్కరికి రూ. 23,750 చెక్కులను మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు.    

తెలంగాణ సినిమాలను ఆదరించాలి 
ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): తెలంగాణ ప్రాంతంలో నిర్మించే సినిమాలను ఆదరించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు.  శ్రీ లక్ష్మినర్సింహా ఫిలిమ్స్‌ బ్యానర్‌పై నిర్మాత వెంకట్, అజయ్‌ నతారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెంకీ.. పింకీ.. జంప్‌ సినిమాకు హౌసింగ్‌బోర్డు కాలనీలో ఆదివారం ఉదయం మంత్రి  మొదటి షాట్‌ కోసం క్లాప్‌ కొట్టగా, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, హీరో విక్రమ్, హీరోయిన్లు, ఇతర నటీనటులు పాల్గొన్నారు.  

హోలీ శుభాకాంక్షలు 
జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్‌రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పండుగలకు ప్రాధాన్యత పెరిగిందని, అన్ని వర్గాల ప్రజలు పండుగలను సుఖసంతోషాలతో జరుపుకొంటున్నారని అన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు.   

చదవండి: 
అత్తా కోడళ్ల పంచాయితీ: ఇంట్లోకి రానివ్వకపోవడంతో..

ఎమ్మెల్సీ సురభివాణికి కరోనా పాజిటివ్‌..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top