
సాక్షి, మెదక్: కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కుమారుడికి, అనిల్‌కు మధ్య విబేధాలు ఉన్నాయి. ఓ భూమి విషయంలో గత కొద్దిరోజులుగా వివాదం నడుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే కుమారుడి వద్ద అనిల్ రూ.80 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో ఉన్న బెంజ్ కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే కుమారుడిదేనని పోలీసులు అంటున్నారు. గత ఐదు నెలలుగా బెంజ్ కారు అనిల్ వద్దనే ఉంటుందని చెబుతున్నారు.
మెదక్ – జోగిపేట ప్రధాన రహదారిపై నిన్న(సోమవారం రాత్రి కాంగ్రెస్ నేత అనిల్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. మండలంలోని పైతర గ్రామానికి చెందిన మరెల్లి అనిల్(28)జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. మెదక్ నుంచి స్వగ్రామానికి కారులో ఆయన ప్రయాణమయ్యాడు.
చిన్నఘనాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అనిల్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే, అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో నాలుగు బులెట్లు లభ్యమయ్యాయి.
