
సాక్షి, మెదక్: అతిభారీ వర్షం దాటికి మెదక్ మరోసారి అతలాకుతలం అయ్యింది. గురువారం జిల్లా కేంద్రంలో కేవలం మూడున్నర గంటల వ్యవధిలో 13 సెం.మీ వర్షం (క్లౌడ్ బరస్ట్) కురిసింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీపల్లి 9.2, పాతుర్ 8 సెం. మీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరు చేరింది. గాంధీ నగర్ కాలనీని రోడ్డు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
రామ్ దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద పోటెత్తింది. మెదక్-హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో మధ్యలో ఉన్న డివైడర్‌ను అధికారులు తొలగించారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో మొన్నటి పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.