తెలంగాణ బంద్‌: అడవుల్లో హై అలర్ట్

Maoists Call For Telangana Bandh For Release Varavarao - Sakshi

సాక్షి, ఆదిలాబాద్ :‌ ప్రజాకవి, విరసం నేత వరవరరావును విడుదల చేయాలని కోరుతు శనివారం తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్‌ పటిష్టం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ ఏరియాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన బలగాలు.. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఆ ప్రాంతాలను వారి గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టి ఉంచారు.

మంచిర్యాల-మహారాష్ట్ర ప్రాంతాలపై కోటపల్లి, వెమనపల్లి, నీల్వయి ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాల్లో 3 రోజులుగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు, సాయుధ దళాల సంచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు అధికార పార్టీ ప్రతినిధి జగన్ రాష్ట్ర కార్యదర్శి పేరిట ఈ నెల 25 న బంద్ పిలుపునిచ్చారు. ఈ నెల 28 నుంచి అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించాలని ప్రకటనలు వెలువడ్డ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ అధ్వర్యంలో జిల్లా డీసీపీ, ఏసీపీలతో పాటు మొత్తం 500 మంది స్పెషల్ పార్టీ, క్యాట్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు ప్రాణహిత పరివాహక గ్రామాల్లోని అడవులను జల్లెడ పడుతున్నారు.

అలాగే సీఐ, ఎస్పై, సీఆర్‌పీఎఫ్ బలగాలు, సివిల్ పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. కొత్త వ్యక్తులను గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆయా గ్రామస్తులను కోరారు. సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంటుందన్నారు. ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాలలో నిరంతరం నిఘా కోసం సీసీ కెమెరాలను అలాగే డోన్ కెమెరాలను వాడుతున్నట్టు అధికారులు తెలిపారు.మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి మావోలు నది దాటి వచ్చే అవకాశం ఉన్నందున అపరిచిత వ్యక్తులపై దృష్టి సారించామన్నారు. సరిహద్దు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top