రైల్వే ట్రాక్‌ పనులు చేస్తూ.. క్వార్టర్స్‌లో ఉంటూ.. | Maoist in Vikarabad District: Telangana | Sakshi
Sakshi News home page

రైల్వే ట్రాక్‌ పనులు చేస్తూ.. క్వార్టర్స్‌లో ఉంటూ..

May 11 2026 2:05 AM | Updated on May 11 2026 2:05 AM

Maoist in Vikarabad District: Telangana

మావోయిస్టులు తలదాచుకున్న రుక్మాపూర్‌ రైల్వే క్వార్టర్స్‌

వికారాబాద్‌ జిల్లాలో మావోయిస్టుల కలకలం 

మహారాష్ట్ర, తాండూరు పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌ 

రుక్మాపూర్‌ రైల్వే క్వార్టర్స్‌లో నలుగురి అరెస్ట్‌  

తాండూరు రూరల్‌: వికారాబాద్‌ జిల్లాలో మావోయిస్టుల ఉనికి కలకలం రేపింది. పెద్దేముల్‌ మండలం రుక్మాపూర్‌ సమీపంలో ఆదివారం తెల్లవారు జామున నలుగురు నక్సలైట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర, తాండూరు పోలీసులు ఈ జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. పట్టుబడిన వారిలో ముగ్గురు పురుషులు, ఓ మహిళా నక్సలైట్‌ ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన నలుగురు మావోయిస్టులు ఆ రాష్ట్రాల కూలీలతో కలిసి పది రోజుల క్రితం పెద్దేముల్‌ మండలం రుక్మాపూర్‌కు వచ్చారు.

రైల్వే ట్రాక్‌ పనులు చేసుకుంటూ, అక్కడి క్వార్టర్స్‌లో తలదాచుకుంటున్నారు. వీరిపై మహారాష్ట్రలో పలు కేసులు ఉన్నట్లు తెలిసింది. వీరి కదలికలపై నిఘా ఉంచిన మహారాష్ట్ర పోలీసులు పక్కా సమాచారంతో పెద్దేముల్‌ మండలానికి వచ్చారు. తాండూరు డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు.. మొత్తం 50 మంది పోలీసులతో కలిసి జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రుక్మాపూర్‌ రైల్వే క్వార్టర్స్‌ను వీరు చుట్టుముట్టారు. అందులో తలదాచుకున్న నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ప్రత్యేక వాహనంలో మహారాష్ట్రకు తరలించారు. కాగా, మావోయిస్టుల పేర్లు, ఫొటోలు ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement