పెట్రో, లిక్కర్‌... పన్నులు బేఫికర్‌ | Liquor and petroleum products are primary pillars of Telangana tax revenue | Sakshi
Sakshi News home page

పెట్రో, లిక్కర్‌... పన్నులు బేఫికర్‌

Apr 4 2026 5:31 AM | Updated on Apr 4 2026 5:31 AM

Liquor and petroleum products are primary pillars of Telangana tax revenue

పన్ను రాబడుల్లో పోటీపడుతున్న మద్యం, పెట్రో ఉత్పత్తులు 

2025–26లో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై రూ. 16,346 కోట్లు, లిక్కర్‌పై రూ. 16,942 కోట్లు 

వస్తువులపై పన్ను రూ.45 వేల కోట్లు కలిపితే జీఎస్టీ వసూళ్లు  రూ. 78 వేల కోట్లకు పైమాటే 

గత ఏడాది కంటే 5 శాతం ఎక్కువ

సాక్షి, హైదరాబాద్‌: పన్నుల వసూళ్లలో పెట్రోల్, మద్యం పోటీ పడుతున్నాయి. ఈ రెండు ఉత్పత్తుల అమ్మకాల కారణంగానే రాష్ట్ర ఖజానాకు రూ. 33,288 కోట్లు సమకూరాయని గణాంకాలు చెబుతున్నాయి. పెట్రోల్‌ అమ్మకాలపై విధించే వ్యాట్‌ ద్వారా రూ. 16,346 కోట్లు సమకూరగా, లిక్కర్‌పై రూ. 16,942 కోట్లు వచ్చాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన పన్ను వసూళ్లలో 42 శాతం పెట్రో, లిక్కర్‌ అమ్మకాలపై విధించిన వ్యాట్‌ ద్వారానే రావడం గమనార్హం. పన్నుల శాఖ గణాంకాల ప్రకారం 2025–26లో జీఎస్టీ, వ్యాట్, వృత్తి పన్ను రూపంలో ఖజానాకు రూ. 78,706 కోట్లు సమకూరాయి.

అంతకుముందు ఏడాది కంటే అన్ని రకాల పన్ను వసూళ్లలో 5 శాతం వృద్ధి నమోదైంది. 2024–25లో అన్ని రకాల పన్నులు కలిపి రూ.75,129 కోట్లు వచ్చాయి. కాగా, 2025 ఏప్రిల్‌ 1 నుంచి 2025 సెస్టెంబర్‌ 30 వరకు 1.2 శాతం ఎక్కువగా పన్ను వసూళ్లు రాగా, 2025 అక్టోబర్‌ 1 నుంచి 2026 మార్చి 31 వరకు 8.1 శాతం వృద్ధి నమోదైంది.

ఇక, జీఎస్టీ కేటగిరీలో గత ఏడాది కంటే రూ.2 వేల కోట్లు ఎక్కువ వచ్చాయి. అదేవిధంగా గత ఏడాది మార్చిలో జీఎస్టీ కింద రూ. 3,574 కోట్లు, పెట్రోల్‌పై వ్యాట్‌ ద్వారా రూ. 1,248 కోట్లు, మద్యం అమ్మకాల ద్వారా రూ. 1,324 కోట్లు వసూలయ్యాయి. అదే ఈ ఏడాది మార్చిలో జీఎస్టీ కింద రూ.4,230 కోట్లు, పెట్రోల్‌పై వ్యాట్‌ ద్వారా రూ. 1,221 కోట్లు, మద్యం అమ్మకాల ద్వారా రూ. 1,437 కోట్లు వచ్చాయి. జీఎస్టీలో ఏకంగా 18 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం.  

Advertisement
 
Advertisement
Advertisement