
క్రమబద్ధీకరణకు అనుమతిచ్చిన హైకోర్టు
2020లో విధించిన స్టే తొలగించిన సీజే ధర్మాసనం
ఏప్రిల్ నుంచి భూ భారతి అమల్లోకి వచ్చిందన్న ఏజీ
సెక్షన్ 6 ప్రకారం సాదాబైనామా క్రమబద్ధీకరించుకోవచ్చని వెల్లడి
9 లక్షలకు పైగా పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉంది
సవరణ పిటిషన్‌ను అనుమతించాలని కోరిన పిటిషనర్
తోసిపుచ్చిన ప్రధాన న్యాయమూర్తి.. పిల్‌ను కొట్టివేస్తూ తీర్పు
సాక్షి, హైదరాబాద్: సాదా బైనామాలకు ఎట్టకేలకు లైన్‌క్లియర్ అయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసి క్రమబద్ధీకరణకు అనుమతిచ్చింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం 2020, అక్టోబర్ 12న జారీ చేసిన జీఓ నంబర్ 112ను సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లా లింబా కె.కుంటాలకు చెందిన షిండే దేవిదాస్ హైకోర్టులో అదే ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అందిన దరఖాస్తులు పరిశీలించవద్దని ప్రభుత్వాన్ని 2020లోనే ఆదేశించింది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాత చట్టం ప్రకారం క్రమబద్ధీకరణ చేయడాన్ని తప్పుబట్టింది. కొత్త చట్టం రాక ముందు (2020, అక్టోబర్ 29) వరకు 2,26,693 దరఖాస్తులు వచ్చాయని, ఆ తర్వాత 6,74,201 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం కోర్టుకు తెలపగా, గడువుకు ముందు వచ్చిన దరఖాస్తులపై నిర్ణయం కూడా తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.
సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం..
ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం విధించిన గడువులోగా 9.24 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో తెలంగాణ భూ భారతి (భూమిపై హక్కుల రికార్డు) చట్టం 2025 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పిల్ చెల్లదని వాదించారు.
ఈ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం 2014, జూన్ 2 ముందు 12 ఏళ్లపాటు భూమి తమ అ«దీనంలో ఉన్నట్లు చూపిన సన్నకారు రైతులకు క్రమబద్దీకరణకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. 2020, అక్టోబర్ 12 నుంచి 2020 నవంబర్ 10 వరకు తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్ పాస్ బుక్స్ చట్టం–1971 ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి క్రమబద్దీకరించుకోవడానికి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.
ఇప్పుడు కొత్త చట్టం వచ్చినందున 2020లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. స్టే ఎత్తివేస్తే 6,74,201 దరఖాస్తుల క్రమబద్దీకరణకు ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభిస్తుందని విన్నవించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జె.ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. పాత చట్టానికి బదులుగా కొత్త చట్టంలోని నిబంధనను సవాల్ చేస్తూ సవరణ పిటిషన్ దాఖలు చేశామని, వాదనలకు అనుమతించాలని కోరారు.
ఈ విజ్ఞప్తిని సీజే తోసిపుచ్చారు. కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ వేసుకోవాలని, అలాగే పలుమార్లు వాయిదా కోరడం సరికాదని సూచించారు. కొత్త చట్టం వచ్చిన తర్వాత కూడా పాత దరఖాస్తులనే అనుమతిస్తున్నారని, కొత్త వాటిని స్వీకరించడం లేదని.. ఇది వివక్షేనని ప్రభాకర్ పేర్కొన్నారు. దీనికి అంగీకరించని సీజే.. కొత్త చట్టంతో సన్న, చిన్నకారు రైతులు సాదా బైనామాలను క్రమబదీ్ధకరించుకనే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 2020లో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తున్నామని ప్రకటించారు.