
జమ్మికుంట (హుజూరాబాద్): ఊరుకు కీడు సోకిందని, అందుకే తరచూ గ్రామంలో ఎవరో ఒకరు చనిపోతున్నారని గ్రామస్తులంతా ఊరు విడిచి బయటకు వెళ్లిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్‌లో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. విలాసాగర్‌లో కొన్ని నెలలుగా ఒకరు మృతి చెందిన వెంటనే వారి దశదిన కర్మలు పూర్తి కాకుండానే మరొకరు చనిపోతున్నారు.
ఇలా గ్రామంలో వరుసగా 11 మంది మృతిచెందడంతో ఆయా కులాల పెద్దలందరూ వేదపండితులను ఆశ్రయించారు. గ్రామానికి కీడు సోకిందని తెలుసుకొని ఊరంతా గురువారం వేకువజామున 5 గంటలకు ముందే ఇళ్లకు తాళాలు వేసి సమీపంలోని మానేరు పరీవాహక ప్రాంతం బ్రిడ్జి వద్దకు తరలివెళ్లారు. అక్కడే వంటలు చేసుకొని సాయంత్రం వరకు గడిపి చీకటిపడ్డాక ఇంటిబాట పట్టారు. దీంతో గ్రామంలో నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. గతంలో కూడా ఇలాగే బయటకు వెళ్లామని, ఫలితం కనబడిందని గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment