9 రోజులు.. రూ.383 కోట్లు! | Land Registration Revenue Income rs 383 Crore In 9 Days Telangana | Sakshi
Sakshi News home page

9 రోజులు.. రూ.383 కోట్లు!

Jan 1 2021 10:57 AM | Updated on Jan 1 2021 1:33 PM

Land Registration Revenue Income rs 383 Crore In 9 Days Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మూడు నెలల విరామం తర్వాత ఈనెల 21 నుంచి రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రారంభమైన ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ ఖజానా కళకళలాడుతోందని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈనెల 21 నుంచి 31 వరకు మొత్తం 9 పనిదినాల్లో ఏకంగా రూ.383 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ముఖ్యంగా ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలో కొంత సడలింపు ఇచ్చిన రెండ్రోజుల్లోనే ఏకంగా 20 వేలకు పైగా లావాదేవీలు జరగ్గా, రూ.170 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇక ఇంత పెద్ద మొత్తంలో మార్చి నెల తర్వాత ఈ నెలలోనే రూ.400 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం వచ్చిందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద కరోనా దెబ్బతో పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన మూడు నెలల తర్వాత కార్యకలాపాలు ప్రారంభం కావడంతో పెండింగ్‌లో ఉన్న లావాదేవీలను పూర్తి చేసుకునేందుకు వస్తున్న ప్రజలతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. అయితే, ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనకు సడలింపు ఇవ్వడంతో కొత్త సంవత్సరంలోనూ రిజిస్ట్రేషన్లు భారీగానే జరుగుతాయని ఆ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  (చదవండి: సీఎం కేసీఆర్ మరో‌ సంచలన నిర్ణయం )

ఈ ఏడాది రూ.5,500 కోట్ల వరకే.. 
ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని వార్షిక బడ్జెట్‌లో అంచనా వేయగా, కరోనా దెబ్బకు ఆ అంచనాలు కుదేలయ్యాయి. దీనికి తోడు మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఇప్పటివరకు ఈ ఏడాది కేవలం రూ.1,864 కోట్లు మాత్రమే సమకూరాయి. అయితే, ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో నెలకు రూ.1,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని, మొత్తం మీద ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.5,500 కోట్ల వరకు రావచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement