రాజకీయాల్లోకీ సైబర్‌ నేరాలు

KTR at inauguration of Cyber Safety Centre - Sakshi

నియంత్రణకు త్వరలో ప్రత్యేక చట్టం: మంత్రి కేటీఆర్‌ 

నల్సార్‌తో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం 

సైబర్‌ మోసాల బాధితులు 1930 టోల్‌ఫ్రీకి ఫిర్యాదు చేయాలి 

లైంగిక నేరాలకు పాల్పడితే ప్రభుత్వ రాయితీలకు అనర్హులు 

సైబర్‌ సేఫ్టీ కేంద్రం ప్రారంభోత్సవంలో కేటీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌: రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్‌ నేరాలను అరికట్టేందుకు త్వరలోనే ప్రత్యేక చట్టాలను అమలు చేయనున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. చట్టాల రూపకల్పనలో నల్సార్‌ విశ్వవిద్యాలయం నిమగ్నమైందని, ఈమేరకు వర్సిటీతో ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుందని పేర్కొన్నారు. ప్రత్యేక సైబర్‌ చట్టాలతో కేసుల విచారణ, దర్యాప్తు వేగవంతమవడంతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని స్పష్టంచేశారు.

సైబర్‌ చట్టాలను అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని తెలిపారు. శనివారం సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ సైబర్‌ సేఫ్టీ కేంద్రాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్, ఐఐటీ హైదరాబాద్, సైయంట్‌ సంస్థల సహకారంతో పోలీసులు ఏర్పాటు చేసిన ఈ కేంద్రం దేశంలోనే మొదటిది.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. వ్యక్తులు, సంస్థలతోపాటు రాజకీయాల్లో కూడా సైబర్‌ నేరాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు గూగుల్‌ పే ద్వారా ఓటర్ల ఖాతాలకు నగదు బదిలీ చేశారని ఆరోపించారు. పోలీసులు, న్యాయ విభాగాలు మాత్రమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాజకీయాల్లో సైబర్‌ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
ఒక్కసారి రిజిస్టర్‌లోకి ఎక్కితే... 
అమెరికా తరహాలో లైంగిక నేరస్తుల జాబితా తెలంగాణలోనూ అమలు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు కేటీఆర్‌ తెలిపారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితుల జాబితాతో ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించాలని సూచించారు. నిందితుల పేరు, ఇతరత్రా వివరాలను రిజిస్టర్‌లో ఎక్కించాలని, ఆ దిశగా కార్యాచరణ వేగవంతం చేయాలని పోలీసు శాఖకు సూచించారు. ఒకసారి రిజిస్టర్‌లో ఎక్కితే వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు, రాయితీలకూ అనర్హులుగా ఉంటారని హెచ్చరించారు.  
 
డ్రోన్‌ పోలీసింగ్‌.. 
అవగాహన లోపం వల్లే సైబర్‌ నేరాలు జరుగుతున్నాయని, మోసపోతున్న వారిలో విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు కూడా ఉండటం విచారకరమని కేటీఆర్‌ చెప్పారు. సైబర్‌ మోసాల బారిన పడిన వారు 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

పోలీసు యంత్రాంగం సాధ్యమైనంత ఎక్కువగా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ‘మారుమూల ప్రాంతంలోని బాధితుడు డయల్‌ 100కు కాల్‌ చేస్తే పోలీసు వెళ్లాలంటే సమయం పడుతుంది. పోలీసు కంటే ముందే కెమెరా, సైరన్, లైట్‌తో డ్రోన్‌ వెళ్లి అక్కడి పరిస్థితిని పోలీసులకు చేర్చే స్థాయికి రాష్ట్రం ఎదగాలి. ఈ మేరకు డీజీపీ, హోంమంత్రి కార్యాచరణ రూపొందించాలి’ అని కేటీఆర్‌ చెప్పారు. 
 
నెక్ట్స్‌జెన్‌ పోలీసింగ్‌: డీజీపీ మహేందర్‌ రెడ్డి 

సాధారణ పోలీసులు, సిబ్బంది స్థానంలో టెక్‌ పోలీస్, నెక్ట్స్‌జెన్‌ పోలీసుగా మారాల్సిన అవసరం ఏర్పడిందని డీజీపీ మహేందర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతికత వినియోగంలో తెలంగాణ ముందు వరుసలో ఉంటుందన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించవచ్చని, దీంతో రాష్ట్ర ఆదాయం కూడా మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు.

ఐటీ రంగంలో హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్‌ ఎకో సిస్టమ్‌ బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని, సైబర్‌ సేఫ్టీ కేంద్రం ఏర్పాటుకు కారణమిదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, ఏసీబీ డీజీ అంజనీకుమార్‌ యాదవ్, పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్, మహేశ్‌ భగవత్, స్టీఫెన్‌ రవీంద్ర, సైయంట్‌ ఫౌండర్, చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top