‘గ్రేటర్‌’ నగారా

KTR About Greater Hyderabad Municipal Elections - Sakshi

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కేటీఆర్‌ సంకేతం

ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం

డివిజన్‌లో నేతల నడుమ అంతర్గత సమస్యలు పరిష్కరించుకోవాలి

మూడు వేల పట్టభద్రుల ఓట్లు నమోదు చేస్తేనే సిట్టింగులకు సీట్లు

10 నుంచి 15 శాతం కార్పొరేటర్ల పనితీరు సంతృప్తికరంగా లేదు

ఐదేళ్లలో చేసిన అభివృద్ధితో ‘ప్రగతి నివేదిక’

అక్టోబర్‌ 15న మరోమారు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సంబంధించి నవంబర్‌ 11 తర్వాత ఏ క్షణమైనా షెడ్యూలు వెలువడే అవకాశముందని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు పార్టీ నేతలకు కీలక సంకే తం ఇచ్చారు. ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ నాయకులకు సూచించారు. కార్పొరేటర్ల పనితీరు, ఓటర్ల నమోదు, క్షేత్రస్థాయిలో పార్టీ నేతల నడుమ అంతర్గత విభేదాలు, గ్రాడ్యుయేట్‌’ఓటర్ల నమోదు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు మహమూద్‌ అలీ, సబిత, తలసాని, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో మంగళవారం మంత్రుల నివాస సముదాయంలో కేటీఆర్‌ సమావేశమయ్యారు.

‘జీహెచ్‌ఎంసీ ప్రతీ డివిజన్‌ పరిధిలో కనీసం మూడు వేల మంది పట్టభద్రులను గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గ ఓటర్లుగా నమోదు చేయాలి. కార్పొరేటర్ల టికెట్ల కేటాయింపులో దీనిని కూడా ప్రాతిపదికగా తీసుకుంటాం. సాధారణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో జరిగే ఎన్నికల్లో పోలింగ్‌ శాతం 40 నుంచి 45 శాతానికి మించదు. కరోనా నేపథ్యంలో ఓటింగ్‌ శాతం ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి సాధారణ ఓటరు నమోదు కార్యక్రమాన్ని కూడా సవాలుగా తీసుకోవాలి. పార్టీకి ఒక్కోడివిజన్‌లో కనీసం 15వేల ఓటు బ్యాంకు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి’  అని కేటీఆర్‌ సూచించారు. జీహెఎచ్‌ఎంసీ ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం 2021 ఫిబ్రవరి వరకు ఉంది. ఆలోపు కొత్త కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ ముగియాల్సి ఉంటుంది.

పనితీరు బాగాలేకుంటే పక్కన పెడతాం
‘జీహెచ్‌ఎంసీ టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్లలో 10 నుంచి 15 శాతం మంది పనితీరు బాగా లేదు. డివిజన్లలో తిరగకపోతే పక్కన పెట్టి ఎమ్మెల్యేల ద్వారా పనిచేస్తాం. కార్పోరేటర్లు తమ డివిజన్‌ పరిధిలో తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నగరంలో అనేక కారణాలతో కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్లు జరగక ప్రజలకు ఆస్తుల పైన సంపూర్ణ హక్కులు లేకుండా ఇబ్బందిపడుతున్నారు. వీటన్నింటినీ సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

స్థిరాస్తులపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు చేపట్టే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుంది. ఇందులో దళారులు చొరబడకుండా కార్పోరేటర్లు జాగ్రత్తలు తీసుకోవాలి. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ‘హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదులో ప్రతీ ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో పాటు ఓటర్లుగా నమోదు కావాలి. అక్టోబర్‌ 15న మరోమారు జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లతో సమావేశం నిర్వహిస్తాం’అని కేటీఆర్‌ తెలిపారు.

రూ.67 వేల కోట్లతో అభివృద్ది పనులు
‘ఐదేళ్లలో హైదరాబాద్‌ నగర అభివృద్దితో పాటు వివిధ కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.67 వేల కోట్లు ఖర్చు చేసింది. వేల కోట్లు ఖర్చు చేసి తాగునీటి ఇబ్బందులు తొలగించడంతో పాటు, వందల కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధి చేశాం. లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా హైదరాబాద్‌కు రప్పించాం. గడిచిన ఐదేళ్లుగా హైదరాబాద్‌ నగర అభివృద్దికి చేపట్టిన కార్యక్రమాలు, మౌలిక వసతులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో ప్రగతి నివేదిక విడుదల చేస్తాం. ఈ నివేదిక ఐదేళ్లలో టీఆర్‌ఎస్‌ పనితీరుకు నిదర్శనంగా ఉంటుంది’అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పోరేటర్లు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top