తెలంగాణకు 23 ఆంధ్రప్రదేశ్‌కు 10 టీఎంసీలు | Krishna Board Water Allocation: 23 TMC for Telangana, 10 TMC for AP | Sakshi
Sakshi News home page

తెలంగాణకు 23 ఆంధ్రప్రదేశ్‌కు 10 టీఎంసీలు

May 13 2026 5:17 AM | Updated on May 13 2026 5:17 AM

Krishna Board Water Allocation: 23 TMC for Telangana, 10 TMC for AP

వేసవిలో తాగునీటి కోసం రెండు రాష్ట్రాలకు కేటాయింపు 

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌:  శ్రీశైలం జలాశయంలో కనీస నిల్వమట్టానికి (ఎండీడీఎల్‌) ఎగువన మిగిలి ఉన్న 5.27 టీఎంసీల జలాలను పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. నాగార్జునసాగర్‌ జలాశయంలో ఎండీడీఎల్‌కి ఎగువన 28.21 టీఎంసీల నిల్వలు మిగిలి ఉండగా, ఏపీ తాగునీటి అవసరాలకు కుడి కాల్వ ద్వారా 10 టీఎంసీలను విడుదల చేయాలని నిర్ణయించింది. మిగిలిన 18.21 టీఎంసీలను సాగర్‌ ఎడమ కాల్వ ద్వారా తెలంగాణకు విడుదల చేయాలని నిర్ణయించింది. మొత్తంగా ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 23.48 టీఎంసీల జలాలను త్రిసభ్య కమిటీ కేటాయించింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సతీష్‌ కంబోజ్‌ అధ్యక్షతన మంగళవారం జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. వేసవి తాగునీటి అసవరాల కోసం ఇరు రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులపై ఈ భేటీలో చర్చించారు. 

వేసవి అవసరాలకు విన్నపాలు: మే 31 నాటికి ఉండనున్న తమ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌ నుంచి కుడి కాల్వకు 10 టీఎంసీల జలాలను విడుదల చేయాలని గతంలో కృష్ణా బోర్డుకు ఏపీ విజ్ఞప్తి చేసింది. మరోవైపు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు, హైదరాబాద్‌ నగరం, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌ నుంచి 13 టీఎంసీలు.. మొత్తంగా 18 టీఎంసీల జలాలను జూలై చివరి నాటికి వాడుకుంటామని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. కాగా ఏపీ విజ్ఞప్తిపై మంగళవారం నాటి భేటీలో తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో 1112.66 టీఎంసీల కృష్ణా జలాలు లభ్యతలోకి ఉండగా, ఏపీ ఇప్పటికే ఏకంగా 771.25 టీఎంసీలు (74.23శాతం) వాడుకుందని కమిటీ దృష్టికి తెచ్చింది. అయితే వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యతనిస్తూ పరస్పరం సహకరించుకోవాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సూచించడంతో ఈ మేరకు కేటాయింపులకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.    

Advertisement
 
Advertisement
Advertisement