సగానికి చేరిన ఎస్సారెస్పీ  | Krishna and Godavari rivers are increasing water flow with heavy rains | Sakshi
Sakshi News home page

సగానికి చేరిన ఎస్సారెస్పీ 

Jul 14 2021 12:55 AM | Updated on Jul 14 2021 12:55 AM

Krishna and Godavari rivers are increasing water flow with heavy rains - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో ప్రవాహాలు పెరుగుతున్నాయి. ఎగువ వర్షాలకు రాష్ట్ర పరిధిలోని పరీవాహకంలో కురుస్తున్న వర్షాలు తోడవడంతో ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు ఉధృతమవుతున్నాయి. ముఖ్యంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. 92 వేల క్యూసెక్కులకుపైగా నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో నీటి నిల్వ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులో నిల్వలు 90 టీఎంసీలకుగానూ 47.70 టీఎంసీలకు చేరగా, ఈ సీజన్‌లోనే ప్రాజెక్టులోకి కొత్తగా 30 టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరింది. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 33.98 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండగా, ఈ ఏడాది మాత్రం మరో 13 టీఎంసీలు అదనంగా ఉండటం ఆయకట్టు రైతులకు పెద్ద ఊరటనిస్తోంది.

గోదావరి బేసిన్‌లో ఇతర ప్రాజెక్టులకు చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి ప్రవాహాలు వస్తున్నా యి. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో సింగూరు, లోయర్‌మానేరు, కడెం, మిడ్‌మానేరులో ప్రవాహాలు స్ధిరంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే కడెం, లోయర్‌మానేరు, మిడ్‌ మానేరు, ఎల్లంపల్లి నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. మరో మూడు నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో ఈ ప్రవాహాలు మరింత పుంజుకునే అవకాశాలున్నట్లు నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టే ప్రాజెక్టు ఇంజనీర్లను అప్రమత్తం చేసింది.  

కృష్ణా బేసిన్‌లో అప్రమత్తం 
ఇక కృష్ణా బేసిన్‌లోనూ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కృష్ణా నది జన్మస్థలి అయిన మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో 120 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతో దిగువన కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌లకు భారీ వరద ప్రవాహాలు నమోదయ్యే అవకాశముంది. దీనిపై ఇప్పటికే కేంద్ర జల సంఘం పరీవాహక రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బుధ, గురు, శుక్రవారాల్లో భారీగా ప్రవాహాలు వచ్చే దృష్ట్యా ప్రాజెక్టుల నిల్వలపై దృష్టి పెట్టాలని, డ్యామ్‌ల్లో నీటి నిల్వలు నిండుగా ఉంచకుండా కొంత ఖాళీగా ఉంచేలా నిర్వహణ చేపట్టాలని సూచించింది. దీంతో ఆల్మట్టిలో 129 టీఎంసీలకుగానూ 93.83 టీఎంసీల నిల్వలు ఉంచి ప్రస్తుతం వస్తున్న 10 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్‌కి 12 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ఆ నీటిని దిగువకు వదులుతున్నారు ఈ నీరంతా జూరాలకు చేరనుంది. ప్రస్తుతం జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు కేవలం వందల క్యూసెక్కుల్లో మాత్రమే నీటి ప్రవాహాలు వస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement