కంటి‘వెలుగు’ షురూ

Kanti Velugu: Over 1 6 Lakh Across TS Underwent Eye Screening On Day 1 - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత కార్యక్రమం ప్రారంభం

హైదరాబాద్‌లో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

తొలిరోజు 1.60 లక్షల మందికి కంటి పరీక్షలు

1,500 కేంద్రాల్లో పరీక్షలు 

గుత్తా, ఇంద్రకరణ్, జగదీశ్‌రెడ్డికి కూడా టెస్టులు 

55 లక్షల కళ్లజోళ్ల పంపిణీ లక్ష్యం: మంత్రి హరీశ్‌ 

సాక్షి నెట్‌వర్క్‌: రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ఖమ్మంలో దీనిని ప్రారంభించగా, గురువారం నుంచి రాష్ట్రంలోని 1,500 కేంద్రాల్లో కంటి పరీక్షలు చేపట్టారు. తొలిరోజు 1.60 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 72,580 మంది పురుషులు, 87,889 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు పరీక్షలు చేయించుకున్నారు.

మొత్తం 70 వేల మందిలో సమస్యలు గుర్తించారు. 37 వేల మందికి దగ్గరి చూపు లోపానికి సంబంధించి అద్దాలు అందజేశారు. మరో 33 వేల మందిలో ఇతరత్రా సమస్యలు గుర్తించి అద్దాల కోసం సిఫారసు చేశారు. అతి తక్కువ మందికి శస్త్ర చికిత్సలు అవసరమని తేల్చారు. మొత్తం మీద తొలిరోజు పరీక్షించిన వారిలో 43.75 శాతం మందికి రకరకాల చూపు సమస్యలు ఉన్నట్లు తేలింది. పట్టణ ప్రాంతాల్లో రద్దీ తక్కువగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 40 ఏళ్ల పైబడ్డ వారితో క్యూ లైన్లు నిండిపోయాయి.  

పలువురు ప్రముఖులకు అద్దాలు  
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో కంటి పరీక్ష చేసుకోగా, ఆయనకు దగ్గరి చూపు (షార్ట్‌ విజన్‌) లోపం ఉన్నట్లు గుర్తించి అద్దాలు అందజేశారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వేములపల్లి మండల కేంద్రంలో పరీక్ష చేసుకోగా లోపం ఉందని గుర్తించి రీడింగ్‌ గ్లాసులు అందజేశారు. సూర్యాపేటలో పరీక్ష చేయించుకున్న రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి ఎలాంటి అద్దాలు అవసరం లేదని నిర్ధారించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పరీక్షలు చేయించుకున్నారు. వీరిద్దరికీ అద్దాలు అందజేశారు. 

ఎక్కడ కావాలంటే అక్కడికే.. 
గేటెడ్‌ కమ్యూనిటీలు, కాలనీలు, బస్తీలు, అపార్ట్‌మెంట్లు.. ఎక్కడ సేవలు కావాలన్నా ట్విట్టర్‌ లేదా వెబ్‌సైట్‌లో రిక్వెస్ట్‌ పెడితే అక్కడికే కంటి వెలుగు బృందాలు వస్తాయని మంత్రి హరీశ్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఏపని చేపట్టినా ప్రజల మంచి గురించి ఆలోచించి చేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. టీఎస్‌ఎంఐడీసి చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్, ఆరోగ్య శాఖ కమిషనర్‌ శ్వేత మహంతి తదితరులు పాల్గొన్నారు. 

అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యం..
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో కలిసి హైదరాబాద్‌ అమీర్‌పేటలో కంటి వెలుగు పరీక్షా శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అంధత్వ రహిత తెలంగా ణ కంటి వెలుగు లక్ష్యమని చెప్పారు. ఎవరూ కంటి చూపు సమస్యతో బాధపడకూడదనే ఉద్దేశంతో 2018లో సీఎం కేసీఆర్‌ ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గతంలో 8 నెలల పాటు కంటి వెలుగు నిర్వహిస్తే ఈసారి 100పనిదినాల్లో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ దఫా కంటి వెలుగు ద్వారా 55 లక్షల కళ్ళ జోళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top